
న్యూజిలాండ్‌పై డిఎల్‌ఎస్ పద్ధతిపై 21పరుగుల తేడాతో గెలుపు
వర్షంతో పలుమార్లు అంతరాయం
బెంగళూరు: ఐసిసి ప్రపంచకప్‌లో భాగంగా ఎం చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో అదృష్టం పాకిస్తాన్‌ను వరించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 402పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ జట్టు తొలుత 21.3ఓవర్లలో వికెట్ నష్టానికి 160పరుగులు చేసిన దశలో మ్యాచ్ వర్షం కారణంగా నిలిచింది. వర్షం నిలిచిన తర్వాత మళ్లీ మ్యాచ్ ప్రారంభమయ్యాక అంపైర్లు పాకిస్తాన్ జట్టు 41ఓవర్లలో 342పరుగులు చేయాల్సిందిగా నిర్దేశించారు. మ్యాచ్‌ను కొనసాగించిన పాక్ జట్టు 25.3ఓవర్లలో వికెట్ నష్టానికి 200 పరుగులు చేసిన దశలో మరో దఫా వర్షం మ్యాచ్‌కు పూర్తిగా అంతరాయం కలిగించింది. ఎంతసేపటికీ వర్షం తగ్గకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిపై పాకిస్తాన్ 21పరుగులు తేడాతో గెలిచినట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో పాకిస్తాన్ క్రీడాభిమానులు ఆనందోత్సవాల్లో మునిగి తేలారు. ఈ విజయంతో పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు మెరుగయ్యాయి.
అంతకుముందు నెగ్గిన పాకిస్తాన్ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ బ్యాటర్లు పాకిస్తాన్ పేస్ త్రయాన్ని చీల్చి చెండాడారు. ఓపెనర్ రచిన్ రవీంద్ర(108; 94బంతుల్లో 15ఫోర్లు, సిక్సర్) మూడో సెంచరీని నమోదు చేయగా.. కెప్టెన్ కేన్ విలియమ్సన్(95; 79బంతుల్లో 10ఫోర్లు, 2సిక్సర్లు) సెంచరీకి దగ్గర్లో ఔటయ్యాడు. వీరిద్దరూ కలిసి 2వ వికెట్‌కు 180పరుగులు జతచేశారు. చివర్లో గ్లెన్ ఫిలిఫ్స్(41), మార్క్ చాప్మన్(39), మిచెల్ శాంట్నర్(22నాటౌట్) బ్యాట్ ఝుళిపించారు. ఓపెనర్ డెవాన్ కాన్వే(35) నిరాశపరచగా.. బటన వేలి గాయం నుంచి కోలుకున్న విలియమ్సన్ మరోసారి బ్యాట్ ఝుళిపించాడు. న్యూజిలాండ్ బ్యాటర్లు ధాటికి పాస్ స్పీడ్‌స్టర్ షాహీన్ ఆఫ్రిది 90పరుగులు సమర్పించుకున్నాడు. ఈ ఏడాది 24 వన్డేల్లో అతడు ఒక్క వికెట్ కూడా తీయకపోవడం ఇదే మొదటిసారి. పాక్ బౌలర్లందరూ ధాటిగా పరుగులు సమర్పించుకోవడంతో న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 401పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. పాకిస్తాన్ బౌలర్లలో మహ్మద్ వసీం జూనియర్‌కు మూడు, రవూఫ్, ఇప్తికార్, హసన్ అలీకి ఒక్కో వికెట్ దక్కాయి.
భారీ ఛేదనకు దిగిన పాకిస్తాన్‌కు రెండో ఓవర్లోనే ఓపెనర్ అబ్దుల్లా షఫీక్(6) వికెట్‌ను కోల్పోయింది. కెప్టెన్ బాబర్‌తో కలిసి జమాన్ కివీస్ బౌలర్లపై ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. 39 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తిచేసిన జమాన్.. గ్లెన్ ఫిలిప్స్ వేసిన 15వ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. 17వ ఓవర్లో జమాన్ 6, 4, 4తో రెచ్చిపోయాడు. సౌథీ వేసిన 19వ ఓవర్లో భారీ సిక్సర్ కొట్టి 90లలోకి వచ్చిన ఫకర్.. శాంట్నర్ వేసిన 20వ ఓవర్లో తొలి బంతికి సిక్సర్ కొట్టి రెండో బంతికి సింగిల్ తీసి సెంచరీ పూర్తిచేశాడు. 63 బంతుల్లోనే అతడి సెంచరీ పూర్తయింది. ఈ వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ తరఫున ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. వర్షంతో మ్యాచ్ నిలిచే సమయానికి ఫకర్(126నాటౌట్; 81బంతుల్లో 8ఫోర్లు, 11సిక్సర్లు), బాబర్(63నాటౌట్; 63బంతుల్లో 6ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంస ఇన్నింగ్స్ ఆడారు. ఈ గెలుపులో పాకిస్తాన్ జట్టు 8పాయింట్లతో 5వ స్థానానికి ఎగబాకింది. ప్లేయర్ ఆప్ ది మ్యాచ్ ఫకర్ జమాన్‌కు లభించింది.
స్కోర్‌బోర్డు...
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి)రిజ్వాన్ (బి)హసన్ అలీ 35, రవీంద్ర (సి)షౌద్ షకీల్ (బి)మహ్మద్ వాసిం జూనియర్ 108, విలియమ్సన్ (సి)ఫకర్ జమాన్ (బి)ఇప్తికార్ అహ్మద్ 95, మిఛెల్ (బి)హరీస్ రవూఫ్ 29, చాప్మన్ (బి)మహ్మద్ వాసీం జూనియర్ 39, ఫిలిప్స్ (బి)మహ్మద్ వాసిం జూనియర్ 41, సాంట్నర్ (నాటౌట్) 26, లాథమ్ (నాటౌట్) 2, అదనం 26. (50ఓవర్లలో 6వికెట్ల నష్టానికి) 401పరుగులు.
వికెట్ల పతనం: 1/58, 2/248, 3/261, 4/318, 5/345, 6/386
బౌలింగ్: షాహిన్ అఫ్రిది 10-0-90-0, హసన్ అలీ 10-0-82-1, ఇప్తికార్ అహ్మద్ 8-0-55-1, హరీస్ రవూఫ్ 10-0-85-1, మహ్మద్ వాసిం జూనియర్ 10-0-60-3, అఘా సల్మాన్ 2-0-21-0
పాకిస్తాన్ ఇన్నింగ్స్: అబ్దుల్లా షఫీక్ (సి)విలియమ్సన్ (బి)సౌథీ 4, ఫకర్ జమాన్ (నాటౌట్) 126, బాబర్ అజామ్ (నాటౌట్) 66, అదనం 4. (25.3ఓవర్లలో వికెట్ నష్టానికి) 200పరుగులు.
వికెట్ల పతనం: 1/6
బౌలింగ్: బౌల్ట్ 6-0-50-0, సౌథీ 5-0-27-1, సాంట్నర్ 5-0-35-0, ఫిలిప్స్ 5-1-42-0, ఇష్ సోథీ 4-0-44-0, మిఛెల్ 0.3-0-1-0.