
లాహోర్: ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్ జట్టు గ్రూప్ దశలో నిష్క్రమించడంతో ఆ జట్టు బౌలింగ్ కోచ్‌గా ఉన్న సౌతాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్ తన పదవికి రాజీనామా చేశారు. మోర్నీ రాజీనామాను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పిసిబి) అంగీకరించింది. ఈ ఏడాది జూన్‌లో పాకిస్తాన్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు అందుకున్న మోర్కెల్ ఆరు నెలలు కూడా గడవకుండానే తన బాధ్యతల నుంచి వైదొలిగాడు. ఈ టోర్నీలో పాకిస్తాన్ బ్యాటింగ్ కంటే బౌలింగ్ వైఫల్యమే ఆ జట్టును నిండా ముంచింది. పాక్ ప్రధాన బౌలర్లుగా ఉన్న షహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్‌లతో పాటు పలు మ్యాచ్‌లలో ఆడిన హసన్ అలీ, మహ్మద్ వసీం(జూనియర్) ఆశించినస్థాయిలో రాణించలేకపోయారు. ముఖ్యంగా హరీస్ రౌఫ్ అయితే ఈ టోర్నీలో ఏకంగా 500కు పైగా పరుగులిచ్చి ఒక వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా చెత్తరికార్డు నమోదు చేసుకున్నాడు. ఇక స్పిన్నర్లు కూడా భారత పిచ్‌లపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు మోర్నీ మోర్కెల్‌పై విమర్శలు గుప్పించడం, వసీం అక్రమ్‌తో పాటు ముస్తాక్ అహ్మద్ వంటి ఆటగాళ్లు పాక్ బౌలింగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో మోర్నీ తన పదవి నుంచి తప్పుకున్నట్లు సమాచారం.