
ప్రజాశక్తి-అమరావతి : మచిలీపట్నం అసెంబ్లీ ఓటర్ల నమోదు ప్రక్రియ చట్ట ప్రకారం, పాదర్శకంగా జరిగేలా ఉత్తర్వులు ఇవ్వాలని దాఖలైన పిల్‌ను హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల అధికారి, ఇతరులకు నోటీసులు జారీ చేసింది. మచిలీపట్నంకు చెందిన వ్యాపారి ఇమదాబత్తుల దిలీప్‌కుమార్ దాఖలు చేసిన పిల్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎవి శేషసాయి, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందర్‌రావుతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. తదుపరి విచారణను జులై 3కు వాయిదా వేసింది. ఒకే ఇంట్లోని వారందరికీ ఒకే పోలింగ్ బూత్‌లో ఓటు వేసేలా చేయాలన్న నిబంధన అమలు కావడం లేదని, అర్హులకు ఓటు హక్కు కల్పించాలని పిటిషనరు తరపున న్యాయవాది రమణకుమారి వాదించారు. ఓటరు నివశించే ప్రాంతానికి రెండు కిలోమీటర్ల పరిధిలోనే పోలింగ్ బూత్ ఉండేలా చేయాలన్నారు.