
- కొత్త వెర్షన్‌తో సమస్యలు
- ప్రైమ్ 2.0 లోపభూయిష్టం
- హక్కు విడుదలకు రెట్టింపు రుసుం
ప్రజాశక్తి- కృష్ణా ప్రతినిధి : స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో పైలట్ ప్రాజెక్టుగా తీసుకొచ్చిన ప్రైమ్ 2.0 వెర్షన్ సాఫ్ట్‌వేర్ లోపభూయిష్టంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ ఒకటో తేదీన కృష్ణా జిల్లాలో 13, ఎన్‌టిఆర్ జిల్లాలో 13, కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఈ వెర్షన్‌ను పైలట్ ప్రాజెక్టుగా తీసుకొచ్చింది. ఇప్పటికి 45 రోజులైనా సాఫ్ట్‌వేర్‌లో సమస్యల కారణంగా వివిధ డీడ్‌లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సమస్యగా మారడం, తీవ్ర జాప్యం జరుగుతోంది. జాయింట్ ఆస్తిలోని ఒకరు హక్కు విడుదల చేసుకోవడానికి సంబంధిత వ్యక్తి వాటా ఆస్తి విలువపై మూడు శాతం స్టాంప్ డ్యూటీ, 0.5 శాతం రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాలి. హక్కు విడుదల చేసుకునే వ్యక్తితోపాటు జాయింట్‌దారుని మిగిలిన ఆస్తికీ స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని సాప్ట్‌వేర్ చూపుతోంది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా మొవ్వ రిజిస్ట్రేషన్ కార్యాలయ పరిధిలోని ఓ గ్రామంలో 1.90 ఎకరాల హక్కు విడుదలకుగాను రూ.22.80 లక్షలకు స్టాంప్ డ్యూటీ రూ.68,400, రిజిస్ట్రేషన్ ఫీజు రూ.11,400 చెల్లించాలి. అయితే, జాయింట్ ఆస్తికి సంబంధించి స్టాంప్ డ్యూటీ రూ.1,59,600, రిజిస్ట్రేషన్ ఫీజు రెట్టింపు చెల్లించాలని సాప్ట్‌వేర్ సూచించింది. ఈ మొత్తం భారంగా ఉండడంతో సంబంధిత వ్యక్తులు రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసుకున్నారు. దస్తావేజుల్లో ఉండే లోపాలను సెల్ఫ్‌గా సవరించుకునేందుకు గత ఏడాది ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. నూతన విధానంలో ఈ సవరణకు అవకాశం లేదు. కుటుంబ సభ్యుల పార్టేషన్ డీడ్ ఎంట్రీ ఫార్మెట్ సక్రమంగా లేదు. ఇతర డాక్యుమెంట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సంబంధిత అధికారి ఫింగర్ ప్రింట్ పెట్టగానే డిజిటల్ సైన్ అవ్వాలి. కానీ, ఒక్కోసారి డిజిటల్ సైన్ అవ్వకుండా నిలిచిపోతోంది. దీంతో, రిజిస్ట్రేషన్లు మరుసటి రోజుకు వాయిదా పడుతున్నాయి. స్థిరాస్తిని కొనుగోలు చేసి నగదు చెల్లించిన వారికి మిగతా 2లో విక్రయించిన వారు ఆ మరుసటి రోజు రిజిస్ట్రేషన్‌కు సహకరించక పోవడంతో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. కంకిపాడు ప్రాంతంలో ఘర్షణ కూడా చోటుచేసుకుంది. ఇటువంటి గందరగోళాల వల్ల స్థిరాస్తి వ్యాపారం మందగించింది. జిల్లా కేంద్రం మచిలీపట్నంలో రోజుకు 50 వరకు రిజిస్ట్రేషన్లు జరగాల్సి ఉండగా, వాటి సంఖ్య 30కి పడిపోయింది.
సాంకేతిక సమస్యల పరిష్కారానికి చర్యలు
రిజిస్ట్రేషన్ శాఖ పైలట్ ప్రాజెక్టుగా కృష్ణా, ఎన్‌టిఆర్ జిల్లాల్లో ప్రైమ్ 2.0 వెర్షన్‌ను తీసుకొచ్చింది. రిజిస్ట్రేషన్లు చేసే క్రమంలో కొన్ని సాంకేతిక సమస్యలను గుర్తిస్తున్నాం. వాటిని పరిష్కరించాల్సిందిగా ఉన్నతాధికారులను ఎప్పటికప్పుడు కోరుతున్నాం.
- కాట్రగడ్డ జగన్మోహనరావు,
మచిలీపట్నం రిజిస్టార్
సమస్యలు పరిష్కరించాలి
నగదు చేతులు మారిన వెంటనే స్థిరాస్తి లావాదేవీలు, రిజిస్ట్రేషన్లు జరిగిపోవాలి. లేకపోతే క్రయవిక్రయదారుల మధ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రైమ్ 2.0 వెర్షన్లో సమస్యలను వెంటనే సవరించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలి.
- టి.హరికృష్ణ, డాక్యుమెంట్ రైటర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు