Sep 01,2023 08:37

ప్రజాశక్తి - విజయవాడ : ఉమ్మడి కృష్ణా జిల్లాలో గురువారం రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఉన్న సాఫ్ట్‌వేర్‌ స్థానంలో కొత్త వర్షన్‌ను ఇన్‌స్టాల్‌ చేస్తుండడంతో కార్యకలా పాలకు తాత్కాలిక అంతరాయం ఏర్పడినట్లు ఆయా రిజిస్ట్రార్‌ కార్యాలయాల అధికారులు తెలిపారు. రోజువారీగా రిజిస్ట్రేషన్‌లో జరుగుతున్న తప్పొప్పులు, దొంగ డాక్యుమెంట్ల నివారణ, త్వరగా సేవలు అందించడానికి రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోని లేటెస్ట్‌ టెక్నాలజీ (కొత్త వర్షన్‌) ఇన్‌స్టాల్‌ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఎన్‌టిఆర్‌ జిల్లా విజయవాడలోని గాంధీనగర్‌, గుణదల, పటమట రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేశారు. ఇందులో ఆధార్‌ కార్డు ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. కొత్తసాప్ట్‌వేర్‌ ఇన్‌స్టాల్‌ వల్ల రిజిస్ట్రేషన్లు మొత్తం ఆగిపోయాయి. ఈ కొత్త వర్షన్‌ను అర్ధం చేసుకోవాలన్నా...దానిని సక్రమంగా నిర్వహించాలన్నా కొంత సమయం పడుతుందని, అప్పటి వరకు రిజిస్ట్రేషన్లు వేగంగా జరిగే అవకాశం లేదని అధికారులు తెలిపారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోనూ రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. కొత్త సాఫ్ట్‌వేర్‌లో సెక్యూరిటీ విషయాలు లేకపోవడం, సాంకేతిక సమస్యలు తలెత్తడంతో విశాఖలో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.