'పిల్లలకు చదువు విలువ తెలియాలి.. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ఆ దిశగా పిల్లలను ఎలా దారి మళ్లించాలి..' అని ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల గురించి ఆందోళన చెందుతారు. అయితే మీ పిల్లలకు ఓ కథ చెప్పండి.. కష్టాలు, కన్నీళ్లు నిండిన ఆ కథ ఓ వాస్తవ గాథ.. ఇల్లిళ్లూ తిరిగి భిక్షాటన చేసిన ఓ అబ్బాయి.. కట్టెలు కొట్టి, శవాలకు గోతులు తీసిన ఓ యువకుడు.. పుస్తకాలు కొనుక్కునేందుకు పశువుల పేడ ఎత్తిన వైనం చెప్పండి. నిత్యం అవమానాలు, అవహేళనల మధ్య చదువనే ఊతం పట్టుకుని పోలీసు శాఖలో ఉన్నతాధికారిగా ఎదిగిన ఆయన, ప్రస్తుతం అనంతపురం ఎఆర్ విభాగంలో ఎఎస్‌పిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎ. హనుమంతులు. ఆయన స్ఫూర్తిగాథ ఎందరికో ఆదర్శం. సామాజిక మాధ్యమంలో ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న ఆయన జీవిత విశేషాలు తన మాటల్లో తెలుసుకుందాం..
'మేం సంచార తెగకు చెందిన వాళ్లం. మా తాత, ముత్తాతలు ఊళ్లు తిరుగుతూ ఊరి చివర ఓ గుడారం వేసుకుని కొన్ని రోజులు అక్కడే మకాం ఉండేవారు. ఊళ్లో ఉండే బయట(పశువుల కొట్టంలో పని, శ్మశానంలో గోతులు తీయడం, పొలంలో ఇతర పనులు) పనులన్నీ చేసేవారు. అలా మా తాత చిత్తూరు జిల్లా కలికిరి మండలం తెల్లగుట్టపల్లి గ్రామంలో ఉంటుండగా అక్కడే చనిపోయాడు. దాంతో ఆ గ్రామమే మా స్వగ్రామం అయ్యింది' అంటూ ఎక్కడా ఇసుమంత గర్వం లేకుండా ఓ సాధారణ వ్యక్తిలా తన పుట్టుక, తన వారి మూలాల గురించి చెబుతున్నారు హనుమంతులు.
అమ్మతో పాటు భిక్షాటన చేశాను..
సంచార తెగ వారు కావడం వల్ల గ్రామంలో పనులు ఉన్నప్పుడు చేసుకోవడం, పనులు లేనప్పుడు ఇల్లిళ్లూ తిరిగి భిక్షాటన చేసుకోవడం ఆ కుటుంబాల ఆనవాయితీ. అలా నలుగురు బిడ్డలను పెంచడానికి హనుమంతులు అమ్మానాన్న ఎన్నో కష్టాలు పడ్డారు. 'అమ్మతో పాటు నేను కూడా భిక్షాటన చేశాను. అప్పుడు నా వయసు 4 ఏళ్లు. నాకు ఆరో ఏడు వచ్చేసరికి అమ్మానాన్న, 'పిల్లలను చదివిస్తే బాగుండు.. మన తలరాతలు మారాలంటే ఎలాగైనా వారిని చదివించాల'ని మాట్లాడుకోవడం విన్నాను. ఆ వయసులో ఆ మాటల లోతు నాకు అర్థం కాకపోయినా.. అమ్మానాన్న సంతోషంగా ఉండాలంటే ఎలాగైనా చదువుకోవాలి అని బలంగా నాటుకుపోయింది.
నా పక్కన కూర్చొనేవారు కాదు..
ఒక రోజు స్కూల్లో చేర్పించేటందుకు అమ్మ నన్ను బడికి తీసుకెళ్లింది. నా చిరిగిన బట్టలు, చింపిరి జుట్టు చూసి అన్నం అడుక్కోవడానికి వచ్చామని భావించి గెంటేయబోయారు. అయితే అన్నం కోసం కాదు.. చదువు కోసం వచ్చానని తెలిసి లోపలికి రమ్మన్నారు. కానీ వారి ఇళ్లకు వెళ్లి అడుక్కోవడం చూసిన తోటి పిల్లలు చాలా రోజులు నన్ను వారి పక్కన కూర్చోనివ్వలేదు. నాతో మాట్లాడలేదు. అలా స్కూల్లో చేరిన కొత్తల్లో ఎన్నో అవమానాలు పడ్డా.. అయినా చదువుకోవడం ఆపలేదు' అంటూ తన తొలి బడి సంగతులు, ఎదుర్కొన్న వివక్ష గురించి ఆయన చెబుతూ 'ఈ రోజుల్లో పిల్లలకు తల్లిదండ్రులు అన్నీ సమకూరుస్తున్నారు. అడిగిందల్లా ఇస్తున్నారు. అయినా పిల్లలు చదువు విలువ తెలుసుకోవడం లేదు' అని ఒకింత విచారం వ్యక్తం చేశారు.
దాహం వేసి నీళ్లడిగితే.. చిప్ప వెతికింది..
హనుమంతులు చదువుకుంటూనే సెలవురోజుల్లో గ్రామంలో బయట పనులకు వెళ్లేవారు. రోజుకు రూ.1, రూ.2 కూలీకి చేసిన రోజులు కూడా ఉన్నాయి. 'ఒకసారి ఓ ఇంట్లో పనికి వెళ్లాను. బాగా దాహం వేసింది. ఆ ఇంటి యజమానిని కాసిన్ని నీళ్లు ఇవ్వమని అడిగాను. అప్పుడు ఆమె నాకు నీళ్లివ్వకుండా చాలాసేపు ఏదో వెతుకుతూ కనిపించింది. 'ఏంటమ్మా వెతుకుతున్నారు' అని అడిగాను. 'మంచినీళ్లు అడిగావు కదరా.. చిప్ప కోసం వెతుకుతున్నాను. అదేమో కనిపించడం లేదు' అంటూ విసుగ్గా మాట్లాడింది. మా కోసం ప్రత్యేకంగా గ్లాసు, బిందె పెట్టుకునే ఆ రోజుల్లో తన ఇంటి బిందెలో నుండి నీళ్లు పోయడానికి ఆమె సంకోచిస్తే దోసిళ్లల్లో పోయమని చెప్పి దాహం తీర్చుకున్నాను. అప్పుడు నేను ఇంటర్ చదువుతున్నాను. ఇటువంటి అవమానాలు నాకు ఎన్నో ఎదురయ్యాయి' అని ఆనాటి సమాజాన్ని ఆయన మన కళ్లముందుంచారు.
విజయనగరంలో ఎన్నో మధురానుభూతులు
1991లో ఆర్‌ఎస్‌ఐ విభాగంలో పోలీసుశాఖలో ఉద్యోగం వచ్చిన హనుమంతులు ఆనాటి నుండి ఇప్పటి వరకు తన గతం తాలూకు జ్ఞాపకాలను మరవలేదు. అందుకే ఆర్‌ఐ, డిఎస్‌పి, ఎఎస్‌పిగా విధులు నిర్వర్తిస్తూనే సమాజానికి తన వంతుగా ఏదైనా సాయం చేయాలని తపించేవారు. సామాజిక సేవలో భాగమయ్యేవారు. యోగాపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తూ పలు కార్యక్రమాల్లో పాల్గొనేవారు. '2016లో విజయనగరంలో విధులు నిర్వర్తిస్తున్నప్పుడు ఓ స్కూల్లో యోగాపై అవగాహనా క్లాసు నిర్వహించాను. ఆ స్కూల్లో డ్రాపౌట్లు ఎక్కువగా ఉన్నారని ఏదైనా స్ఫూర్తివంత మాటలు చెప్పమని స్కూలు యాజమాన్యం నన్ను అడిగింది. ఏవో మాటలు చెప్పే బదులు.. నా గురించి చెబితే సరిపోతుంది కదా అని భావించాను. నా గురించి చెప్పడం అప్పటినుండే మొదలుపెట్టాను. అయితే ఎక్కడా ప్రచారం చేయవద్దని మీడియా వారిని, స్కూలు యాజమాన్యాన్ని కోరేవాడిని. పదేళ్ల క్రితం మొదటిసారి నా జీవితాన్ని ఆ స్కూలు పిల్లలతో చెబితే.. ఆ తరువాత ఎన్నో స్కూళ్లు ప్రత్యేకంగా నన్ను వారి కార్యక్రమాలకు ప్రత్యేక అతిథిగా పిలిచేవారు. పిల్లలతో నా గురించి చెప్పమనేవారు. మొదటిసారి చెప్పినప్పుడు ఆ స్కూల్లో 200 మంది విద్యార్థులు తిరిగి స్కూలుకు వచ్చారని తెలిసి, ఆ జిల్లాలో ఉన్న మిగిలిన స్కూళ్లన్నింటికీ నన్ను పిలిచేవారు' అంటూ పదేళ్ల క్రితం తన అనుభవాన్ని చెప్పిన హనుమంతులను పోలీసు శాఖలోనే కాదు, విద్యావ్యవస్థలోనూ ప్రత్యేకంగా గౌరవిస్తారు. సాధారణంగా పోలీసులకు, టీచర్లకు మధ్య స్నేహసంబంధాలు ఉండడం చాలా అరుదు. కానీ హనుమంతులకు, టీచర్లకు మధ్య ఓ విశేష బంధం ముడిపడి ఉంది.
ప్రత్యేక అనుమతితో టీచర్లు వచ్చారు
'విజయనగరం నుండి అనంతపురం బదిలీ అవుతున్నప్పుడు ఇచ్చిన వీడ్కోలు సభలో పోలీసులతో పాటు వందలమంది ఉపాధ్యాయులు కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సభకు వస్తామని వారంతా అభ్యర్థించారు. సాధారణంగా బయటివారికి అలా అనుమతులు ఇవ్వరు. కానీ ఆ రోజు అందరినీ ఆహ్వానించారు. ఇది నా జీవితంలో మరిచిపోలేని అనుభవం' అంటూ విజయనగరం స్మృతులను ఆయన గుర్తుచేసుకున్నారు.
అందరినీ ఎదగనివ్వాలి
'మనం ఎదుగుతూ సమాజాన్ని కూడా ఎదగనివ్వాలన్న' అంబేద్కర్ సూక్తిని నేను పాటిస్తాను. నేను పడ్డ కష్టాలు, కన్నీళ్లు నా పిల్లలకు చెప్పి, మీ చదువు కోసం సాయం చేస్తాను. మీ భవితకు ఉపయోగపడే చదువు చదువుకోండి. అయితే ఉన్నత విద్యావంతులైన తరువాత సమాజానికి మీ వంతుగా ఏదైనా చేయండి.. అదే మీ నుండి నేను కోరుకునేది అని ఎప్పుడూ చెబుతుంటాను. నా పిల్లలు ఆ బాటలోనే నడుస్తారని గట్టి నమ్మకం ఉంది' అంటూ తన నలుగురు బిడ్డల గురించి చెబుతున్నప్పుడు ఆయన మాటల్లో ఆనందం కనబడుతోంది.
జీవితంలో ఎదురైన ప్రతి కష్టాన్ని దాటుకుంటూ, గొప్ప వ్యక్తిత్వంతో నడుస్తూ.. స్ఫూర్తివంత జీవితాన్ని గడుపుతున్న హనుమంతులు ఇంకా ఇలా అంటున్నారు.. 'నా జీవితం గురించి ఇప్పుడు ప్రతి ఒక్కరూ తెలుసుకుంటున్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలకు చూపిస్తున్నారు. పాఠశాలల్లో ప్రత్యేక తరగతుల్లో నా వీడియోలు ప్రదర్శిస్తున్నారు. విదేశాల్లో కూడా నా జీవితపాఠాలపై ఆసక్తి కనబరుస్తున్నారని తెలిసింది. నా జీవితకథ ద్వారా పిల్లల్లో మార్పు వస్తుందని తల్లిదండ్రులు భావించడం నాకు చాలా ఆనందంగా ఉంది. పిల్లలకు చదువు విలువ తెలియాలి. ఉన్నత విద్యావంతులుగా ఎదగాలి. అప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది. సమాజ అభివృద్ధే దేశ ప్రగతి..
- జ్యోతిర్మయి










