Oct 18,2023 12:19

ఈ నెల 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా పలువురు భారత అభిమానులు తమ జట్టును వేధింపులకు గురి చేశారని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఐసీసీకి ఫిర్యాదు చేసింది. టాస్‌ సమయంలో కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ బ్రాడ్‌కాస్టర్‌ రవిశాస్త్రితో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పుడు మైదానంలోని ప్రేక్షకులు బిగ్గరగా అరుస్తూ, తమ జట్టు పట్ల అనుచితంగా ప్రవర్తించారని పీసీబీ ఆరోపించింది. మహ్మద్‌ రిజ్వాన్‌ ఔటై డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్తుండగా పలువురు అభిమానులు 'జై శ్రీరాం' నినాదాలు చేసి అతన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని పీసీబీ తమ ఫిర్యాదులో పేర్కొంది. అలాగే తమ జర్నలిస్టులకు వీసాల జాప్యం, భారత్‌లో ప్రవేశించకుండా (వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు చూసేందుకు) తమ అభిమానులపై అంక్షలు వంటి పలు అంశాలను కూడా పీసీబీ తమ ఫిర్యాదులో ప్రస్తావించింది. ఈ విషయాలను పీసీబీ తమ అధికారిక సోషల్‌మీడియా ఖాతాల ద్వారా వెల్లడించింది. కాగా, పీసీబీ కొద్దిరోజుల కిందట కూడా ఇదే అంశాలపై ఐసీసీకి ఫిర్యాదు చేసింది.