
పిల్లలూ, మన రాష్ట్ర జంతువు కృష్ణ జింక అని మీకు తెలుసు కదా? దాని గురించి మరిన్ని సంగతులు తెలుసుకుందామా !
కృష్ణ జింక మనదేశంలోనే కాదు; పాకిస్థాన్, నేపాల్ లోని కొన్ని ప్రాంతాల్లో కూడా కనిపిస్తుంది. దీనిని ఆంగ్లంలో బ్లాక్ బక్ అని అంటారు. కృష్ణ జింకలు విశాలమైన పచ్చిక మైదానాల్లో జీవిస్తుంటాయి. ముఖ్యంగా గడ్డిని, అప్పుడప్పుడు పండ్లను తింటాయి.
అతి వేగంగా పరిగెత్తగలిగే జంతువుల్లో కృష్ణజింక ఒకటి. 15 - 20 జింకలు కలిసి ఒక మందగా తిరుగుతాయి. ప్రతి మందలోనూ ఒక బలిష్టమైన మగ జింక ఉంటుంది. మగ కృష్ణ జింక సుమారు 32 అంగుళాల పొడవు పెరుగుతుంది. సుమారు 40 కి.గ్రా. దాకా బరువుంటుంది. కొమ్ములు 3 - 4 మలుపులతో మెలికలు తిరిగి సుమారు 28 అంగుళాల పొడవు దాకా పెరుగుతాయి. మగ జింకలో శరీరపు పైభాగం నలుపు లేదా ముదురు గోధుమ రంగులో ఉంటుంది. పొట్ట, కళ్ళు చుట్టూ ఉండే ప్రాంతం మాత్రం తెలుపురంగులో ఉంటుంది. ఆడ కృష్ణ జింకలు వీటికి భిన్నంగా లేత గోధుమ రంగులో ఉంటాయి. వీటికి కొమ్ములుండవు.
అయితే, ఈ కృష్ణ జింకలు క్రమంగా అంతరించి పోతున్నాయి. కొందరు వీటిని మాంసం కోసం, చర్మం కోసం, వినోదం కోసం చంపుతున్నారు. వన్యప్రాణుల సంరక్షక చట్టం - 1972 ప్రకారం వీటిని వేటాడటం చట్టరీత్యా నేరం.