
ఆడపిల్లలు ఇంట్లో నుండి కాలు బయటపెడితే తిరిగి ఇంటికి వచ్చేదాకా ఆ తల్లిదండ్రులకు కంటిమీద కునుకు ఉండదు. ఆ బిడ్డే ఆటల్లో రాణిస్తానంటే ఆ భయం ఇంకా వెంటాడుతుంది. ఒంటరిగా ఎక్కడెక్కడికో ప్రయాణించాలి. దేశం కాని దేశంలో, కుటుంబానికి దూరంగా నెలల తరబడి గడపాలి. ఇదంతా ఒక ఎత్తయితే.. మగరాయుడిలా ఆ వేషాలేంటి? ఆడపిల్లకి ఇవన్నీ ఎందుకు? పెళ్లి చేసి పంపించేయక.. అనే సూటిపోటి మాటలు ఎప్పుడూ ఉంటాయి. ఇలాంటి ఎన్నో సాదకబాధలను అనుభవిస్తున్నా తమ సత్తా ఏంటో చాటిచెబుతున్నారు మన క్రీడాకారిణిలు. తాజాగా చైనాలో నిర్వహించిన ఆసియా గేమ్స్‌లో వివిధ పోటీల్లో పాల్గొని విజేతలుగా పతకాలు సాధించడం దేశానికే గర్వకారణం కాదు, ఆ కుటుంబాలకి గొప్ప ఊరట. ఆ క్రీడామణుల్లో కొంతమంది గురించి క్లుప్తంగా..

పిండినీళ్లే పాలని భ్రమించి..
పేదరికంలో పుట్టి, తినడానికి తిండి లేక పిండి నీళ్లు తాగి పెరిగింది మన వైజాగ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ. ఈ ఆసియా గేమ్స్‌లో వంద మీటర్ల హర్డిల్స్‌లో ఆమె రజతం సొంతం చేసుకుంది. అంతకుముందు పలు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో తన సత్తా చూపించింది. ఈ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు. అనారోగ్యంతో బాధపడే తండ్రి కుటుంబపోషణ కోసం నైట్ వాచ్‌మెన్‌గా పనిచేసే వాడు. మొదటి సంతానం కొడుకు పుడితే సంతోషపడిన ఆ కుటుంబం రెండో బిడ్డ ఆడపిల్ల పుడితే పెంచలేమని తీర్మానించుకుంది. 'కడుపులో బిడ్డ ఎవరో తెలియకపోయినా అసలు రెండో బిడ్డను పోషించే స్థోమత మాకు లేదు. అదే ఆడపిల్ల అయితే ఆ భారం మరింత అవుతుందని భయపడి అబార్షన్ చేయించుకుందామని ఆస్పత్రికి వెళ్లాను. డాక్టర్లు మందలించి ఇంటికి పంపించేశారు. మేం భయపడ్డట్టే ఆడబిడ్డ పుట్టింది. పాలు లేక గంజినీళ్లు పట్టేదాన్ని. ఒక్కోసారి ఏడుపు ఆపకపోతే పిండినీళ్లు పాలని చెప్పి తాగించేదాన్ని' అంటూ జ్యోతిని గుర్తుచేసుకుని కంటనీరు పెట్టుకుంది తల్లి కుమారి.
'ఎప్పుడూ ఆటలేనా చదువు ధ్యాస లేదా' అని అన్న మందలిస్తే ఏడుస్తూ చీకట్లో నడుచుకుంటూ వెళ్లిపోయిన కూతురును వెతికి వెతికి మరీ ఇంటికి తీసుకొచ్చిన రాత్రి, ఆ తల్లికి ఇంకా గుర్తే.. 'నేను బాగా ఆడతా.. నీకే కాదు.. దేశానికే మంచి పేరు తెస్తా' అని ఆ రోజు ఆమె అన్న మాటలు నేడు రుజువుచేస్తూ పతకాలు కురిపిస్తోంది. 'నీ పరిస్థితి ఏంటి.. ఆడపిల్లని అలా బయటికి పంపుతున్నావు. ఇదేం పద్ధతి?' అన్న వాళ్లే ఈ రోజు జ్యోతి విజయాన్ని ప్రశంసిస్తుంటే ఆమె ఆనందానికి అవధులు లేవు

బంగారు బాణం..
విజయవాడకు చెందిన జ్యోతి సురేఖ వ్యవసాయ కుటుంబం నుండి వచ్చింది. తండ్రి వెటర్నరీ డాక్టరు. తల్లి గృహిణి. తాజా పోటీల్లో ఆర్చరీ విభాగంలో వ్యక్తిగతంగా, బృందంగా పాల్గొని ఏకంగా మూడు బంగారు పతకాలు సాధించింది. బాల్యం నుండే ఆమెను క్రీడాకారిణిగా చూడాలని తల్లిదండ్రులు ఎన్నో కలలుగన్నారు. ఆ దిశగా మొదలుపెట్టిన ప్రయాణంలో సురేఖకు స్విమ్మింగ్ నేర్పించారు. నాలుగేళ్లకే కృష్ణానదిని ఆ చివర నుండి ఈ చివరికి మూడుసార్లు ఈది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న ఆమె ఈతలో రాణిస్తున్నా, బలహీనమైన కాళ్లు ఉండడం వల్ల మున్ముందు పోటీల్లో సత్తా చాటలేదని కోచ్‌లు చెప్పారు. అప్పటికే సురేఖకి11 ఏళ్లు. బిడ్డపై పెంచుకున్న ఆశలన్నీ కరిగిపోయాయని తండ్రి సురేంద్ర ఎంతో మదనపడ్డారు. అయితే ఆ తరువాత వాళ్లు తీసుకున్న నిర్ణయం సురేఖను ఆర్చరీ వైపు అడుగులు వేసేలా చేసింది. ఆ అడుగులే నేడు ఆ ఇంటికి పతకాల వరదను తెచ్చిపెడుతున్నాయి. చిన్న వయసులోనే అర్జున అవార్డును దక్కించుకున్న ఘనత సురేఖ విజయాల జాబితాలో ఒకటి. జాతీయ, అంతర్జాతీయ వేదికలలో పాల్గొంటూ తన సత్తా చూపిస్తున్న సురేఖ ఒలింపిక్‌లో బంగారు పతకం సాధించడమే లక్ష్యంగా దూసుకెళ్తోంది.

అమ్మ అయినా దూసుకుపోతోంది
కేరళకు చెందిన దీపిక పల్లికల్ క్రికెటర్ దినేశ్ భార్యగా ఎందరో అభిమానులకు పరిచయమే. ఆమె తల్లి కూడా భారత క్రికెటర్‌గా రాణించారు. చిన్నప్పటి నుండి క్రికెట్ చూస్తూ పెరిగిన దీపిక మాత్రం భిన్నమైన క్రీడవైపు అడుగులు వేశారు. నిర్దిష్ట వేగంతో గోడకు బంతిని విసిరికొట్టే స్క్వాష్ క్రీడను ఎంచుకున్నారు. ఆ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు. ఆ స్థాయి నుండి ప్రపంచ స్క్వాష్ క్రీడాకారుల్లో టాప్-10లో చోటు దక్కించుకునే వరకు ఎదిగారు. అంతేకాదు, క్రీడల్లో నెగ్గిన స్త్రీ, పురుషులకు సమాన పారితోషికాలు ఇవ్వాల్సిందేనని పోరాడిన ధీరత్వం ఆమె సొంతం. 2012 నుండి 2015 వరకు క్రీడల్లో పాల్గొనకుండా తన నిరసనను తెలియజేసింది కూడా. తన డిమాండ్‌కి సానుకూల ప్రకటన వచ్చిన ఏడాదే అంటే 2016లో జాతీయ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని విజేతగా నిలిచింది. 2021లో కవల పిల్లలకు జన్మనిచ్చిన ఈ 32 ఏళ్ల క్రీడాకారిణి పిల్లలకు ఏడాది వయసు నుండే పోటీల్లో పాల్గొంటున్నారు. క్రికెటర్‌గా భర్త తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు అతనికి కొండంత అండగా నిలబడి అతను మళ్లీ ఆటలో రాణించేలా చేశారు. కూతురుగా, భార్యగా, అమ్మగా తనను తాను నిరూపించుకుంటూనే తనకిష్టమైన రంగంలో విజేతగా నిలుస్తున్నారు.

ఆటో డ్రైవరు కూతురు
లాంగ్ జంప్‌లో రజత పతకం సాధించిన ఆన్సీ కేరళ వాసి. తండ్రి ఆటోడ్రైవర్. ఆటల్లో రాణించాలని ఆ తండ్రి చిరకాల కల. ఒలింపియన్ క్రీడాకారుడు రామచంద్రన్ క్లాస్‌మేట్‌గా ఎన్నో ఆశలున్నా కుటుంబ పరిస్థితులు సహకరించక ఆటోడ్రైవర్‌గా స్థిరపడ్డాడు. అందుకే తన కలను కూతురు ద్వారా సాకారం చేసుకోవాలని పరితపించాడు. అందుకే తండ్రి కల నెరవేర్చడమే లక్ష్యమంటున్న ఆన్సీ ఎన్నో పతకాలు సాధిస్తూ ముందుకు వెళుతోంది. తొలిసారి ఆసియా క్రీడల్లో పాల్గొని పతకం సొంతం చేసుకున్న క్షణాన, 'మనకు ఎదురుగా నిర్దిష్ట లక్ష్యం పెట్టుకున్నప్పుడు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి. అప్పుడే ఆశించిన ఫలితం వస్తుంది' అంటోంది.

72 ఏళ్ల కల సాకారమైన వేళ
మీరట్‌కు చెందిన కిరణ్ బలియాన్ షాట్‌పుట్‌లో కాంస్యం నెగ్గి, ఈ విభాగంలో పతకం కోసం ఎదురుచూస్తున్న భారత్ 72 ఏళ్ల కలను సాకారం చేసింది. హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న తండ్రి గత శుక్రవారం కిరణ్ ఆడిన మ్యాచ్‌ను చూడనైనా చూడలేదు. విధుల్లో ఉన్నారు. విషయం తెలిసిన ఆ తండ్రి సంతోషంతో ఉబ్బితబ్బిబవుతూ వాహనచోదకులకు, పాదచారులకు లడ్డూలు పంచిపెట్టారు. 'నా జీవితంలో ఎక్కువ భాగం ట్రాఫిక్‌ను క్రమబద్దకరించడానికే వెచ్చించాను. నేనొక సాధారణ వ్యక్తిని. రోడ్డుపైనే జీవితం గడిపే నాలాంటి వ్యక్తిని ఈ రోజు నా కూతురు గర్వపడేలా చేసింది' అంటూ ఆ తండ్రి చెబుతున్నప్పుడు కళ్లవెంట ఆనందభాష్పాలు రాలాయి.
ఇలా ఈ పోటీల్లో పాల్గొన్న మహిళా క్రీడాకారిణులందరిదీ ఒక్కో కథ. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో, మరెన్నో సవాళ్లతో బరిలో దిగి, తల్లిదండ్రులను, కుటుంబాన్ని, దేశాన్ని గర్వపడేలా చేస్తున్న వారందరినీ మనసారా అభినందిద్దాం. మున్ముందు మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిద్దాం.