
మచిలీపట్టణానికి చెందిన బెరకా మినిస్ట్రీస్ అధినేత కిరణ పాల్ దంపతులకు 190 మందికిపైగా పిల్లలు ఉన్నారు. వాస్తవానికి వారంతా వారి పిల్లలు కాదు. వారి ఆధ్వర్యంలో నడుస్తున్న బెరాకా ఆశ్రమం (బాలురు, బాలికలు) పెరిగిన, పెరుగుతున్న పిల్లలు వారు. నా అనే వారు లేక వీధుల్లో తిరుగుతున్న ఎందరినో ఆదరించి.. వసతి కల్పిస్తున్నారు కిరణ్ పాల్, ఆయన భార్య నాగలక్ష్మి. ఈ దంపతులు చేరదీయడంతో ఎందరో పిల్లలు ఎందరో పెద్ద పెద్ద చదువులు చదివి నేడు ఉన్నత ఉద్యోగాలు, చదువులు, వివిధ వత్తులు, వ్యాపారాల్లోనూ స్థిరపడి రాణిస్తున్నారు.

మచిలీపట్టణానికి చెందిన కిరణ్‌పాల్ ఎంఎ ఇంగ్లీషు, సోషల్‌వర్క్ పూర్తిచేసి ఆ తర్వాత ఎంఫిల్‌ను అందుకున్నారు. ఆయన కుటుంబంలో చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నవారు ఉన్నారు. 2001లో ఓ విద్యాసంస్థలో అధ్యాపకుడిగా చేరారు. ఓరోజు మచిలీపట్నం రూరల్ మండలం పెద్దపట్నం (గొల్లగూడెం) ప్రాంతానికి ఓ శుభ కార్యక్రమానికి హాజరయ్యారు. అతిథులు అందరూ వచ్చారు. అందరూ భోజనాలు చేస్తున్నారు. ఓ ఇద్దరు పిల్లలు మాత్రం బయట రోడ్డుపక్కన నిలబడి ఉన్నారు. ఒంటిపై సరిగా బట్టలు కూడా లేవు. లోపల భోజనాలు జరుగుతున్నాయి. 'అమ్మా...అయ్యా కాస్త అన్నం పెట్టండయ్యా..' అంటూ అరుస్తున్నారు. కానీ వారి పరిస్థితిని చూసినా ఎవ్వరూ పిలిచే పరిస్థితి లేదు. దీనిని స్వయంగా పరిశీలించిన కిరణ్‌పాల్ తనే వారి వద్దకు వెళ్లి భోజనానికి పిలిచారు. తనతోపాటు కూర్చోపెట్టుకుని భోజనం చేయించారు.
తర్వాత వారితో మాట్లాడితే కుటుంబ దయనీయ పరిస్థితులు అర్థమయ్యాయి. ఆరోజే ఆయన నిర్ణయించుకున్నారు. సమాజానికీ, పేదలకు, అభాగ్యులకు ఏదో ఒకటి చేయాలనే భావించాడు. వెంటనే ఆ ఇద్దరు పిల్లలను తనతోపాటు తీసుకెళ్లారు. బెరకా ఆశ్రమం పేరుతో పిఆర్ కాలనీలో చిన్నపాటి పూరిపాకను తీసుకుని పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించటం ప్రారంభించారు. వీధిబాలలు, బాలకార్మికులు, బస్టాండ్, రైల్వే స్టేషన్లనో చోరీ చేసే పిల్లలు, తల్లిదండ్రుల ఆదరణ లేక, చనిపోయిన వారి పిల్లలు ఇలా అనేక రూపాల్లో పిల్లలు వచ్చి చేర్చేవారు. వారి ఆలనా పాలనా చూసుకుంటుండటంతో మరికొంతమంది చేరిపోయారు. 2005 సునామీ తర్వాత మరింత మంది పిల్లలు వచ్చి చేరారు.

ఈ క్రమంలోనే బెరాకా ఆశ్రమంలో బాలురు, సత్యభారతి పేరుతో బాలకలకు వసతి గహాలు ఏర్పాటుచేశారు. రెండు వసతి గహాల్లో 190 మందిఉంటున్నారు. గడిచిన 20 ఏళ్ల కాలంలో ఎందరో పిల్లలు ఈ ఆశ్రమాల్లో వసతి పొంది నేడు ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. అమెరికా, ఇంగ్లాండ్, సింగపూర్ తదితర దేశాల్లో ఉద్యోగాలు, ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న వారు కూడా ఉన్నారు. అలాంటివారిలో కందేపు గోపీచంద్ ఒకరు. కిరణ్‌పాల్ గురించి అతని బంధువు దిలీప్ తెలుసుకుని తెనాలి దగ్గర కూచిపూడి గ్రామం నుండి తెచ్చి వసతి గృహంలో ఉంచి పెంచారు. అతడి తల్లిదండ్రులు ఇద్దరూ వ్యాధి వారిని పడి మరణించారు. అతను వచ్చేసరికి టిబి వ్యాధితో బాధ పడుతున్నారు. గోపీచంద్‌ను సొంత బిడ్డగా వైద్యం, విద్యనిచ్చి పెంచారు. ఎంబీఏ పూర్తి చేసిన అతను ప్రస్తుతం సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నారు. చిన్నపిల్లలుగా వచ్చిన దశ్యశ్రీ, జోయల్, పగిడి రేవతి, వాణీ వీణా నేడు ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్నారు.
2014లో రోడ్లపై బిక్షాటన చేస్తున్న మేరీ, నరసమ్మ, డవీనా, దుర్గ నేడు మంచి విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారు. ప్రభుదేవా ఇంజనీరింగ్ పూర్తిచేసి ఎంఎస్ చదువుకోసం యుఎస్‌ఎ వెళ్లారు. నరేష్ యాదవ్, అతని భార్య నర్సింగ్ చేసి ఆర్‌ఎంపీలుగా ఉద్యోగం చేస్తున్నారు. పసిగుడ్డుగా ఉండగా బెరాకా ఆశ్రమానికి వచ్చిన పాప కరుణ ఇప్పుడు ఏడో తరగతి చదువుతోంది. ఇలా ఏ పిల్ల వాడిని కదిలించినా హృదయ విధారమైన గాథలే... తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు కొందరైతే... అమ్మానాన్న ఇద్దరిలో ఒకరు చనిపోయిన పిల్లలు మరికొందరు ఉన్నారు. అసలు తల్లి, తండ్రి ఎవరో తెలియని పిల్లలు మరికొందరు ఉన్నారు. వికలాంగులూ ఉన్నారు. వీరిని తమ పిల్లలుగా భావిస్తూ ఈ సంస్థ వ్యవస్థాపకులు కిరణ్‌పాల్, ప్రతినిధులు సాకుతున్నారు.

అభాగ్యుల సేవల్లో ...
సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా బెరాకా మినిస్ట్రీస్ ప్రతినిధులు నిరంతరం కృషిచేస్తున్నారు. ఏటేటా ప్రకృతి విపత్తులు చోటు చేసుకున్నప్పుడు, అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి అక్కడి బాధితులకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. దుస్తులు, వంట సామగ్రి బియ్యం వంటివి అందిస్తున్నారు. పేద పిల్లలకు చదువు నిమిత్తం పలుసార్లు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. ఏటేటా వందలాది మంది పిల్లలకు ఉన్నత చదువుల నిమిత్తం లక్షలాది రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. ఆశ్రమాల్లో చదువుకునే పిల్లలకు ఎక్కడా అభద్రతా భావం రాకుండా ప్రశాంతమైన వాతావరణం, పౌష్టికాహారం కల్పిస్తున్నారు. వారిలో సృజనాత్మకత పెంపొందించటానికి బయట పిల్లలతో కలిపి ఆటలపోటీలు ఏర్పాటు చేయించటం, అనాథ పిల్లలతో వారికి బహుమతులు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు.
- కొడాలి శ్రీను
9492487322,
ప్రజాశక్తి కలెక్టరేట్ విలేకరి, మచిలీపట్నం,

కష్ణాజిల్లా ఆపన్నుల ఆనందంలోనే సంతృప్తి
సమాజంలో తల్లిదండ్రుల ఆదరణ లేని పిల్లలు చాలామంది ఉంటున్నారు. వారు పేదరికంలో మగ్గుతూ చదువు సంధ్యలకు దూరమవుతున్నారు. అలాంటి వారిని అక్కున చేర్చుకుంటున్నాం. గత కొన్నేళ్లుగా అగ్ని ప్రమాదాల్లో ఇళ్లు కాలిపోయిన వారికి ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నాం. చదువుకునే పిల్లలకు ఎల్‌కెజి నుంచి పీజీ వరకూ ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నాం. అనాథలు, అన్నార్తులకు ఆశ్రయం కల్పించి వారికి విద్య, ఆరోగ్యం, క్రమ శిక్షణ, వసతి కల్పిస్తూ భావిభారత పౌరులుగా తీర్చిదిద్దుతున్నాం. పోలీసు, రెవెన్యూ, కార్పొరేషన్ అధికారుల నుండి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల నుంచి కూడా మాకు సహకారం అందుతోంది. ఇక్కడ ఆశ్రయం పొందిన వారిలో ఇప్పటికే ఉన్నతి చెంది మేనేజర్లు, అకౌంటెంట్లు, అనలిస్టులు, టీచర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, నర్సులు, వ్యాపారులు, గహిణులుగా ఉన్నారు. మహిళలకు జ్యూయలరీ, గార్మెంట్ మేకింగ్, గాజుల తయారీ, గ్రీటింగ్‌కార్డుల తయారీ, డిటర్జెంట్ వంటి వాటిపై శిక్షణ ఏర్పాటు చేయిస్తున్నాం. చల్లపల్లిలో 25 పేద కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం నిమిత్తం రూ.50వేలు చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించాం. ఆపన్నుల కళ్లల్లో కనిపించే ఆనందమే మాకు కొండంత సంతృప్తి!
- బి.ఎస్.కిరణ్‌పాల్
బెరాకా మినిస్ట్రీస్ అధినేత మచిలీపట్నం