
ఏ విశ్వవిద్యాలయంలోనైనా ఉన్నత విద్య అందుతుంది. ఈ విశ్వ విద్యాలయంలో మాత్రం చదువుతో పాటు- ఇక్కడే పండించిన సేంద్రియ కాయగూరలతో హాస్టలు విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఆహారం కూడా అందుతుంది. ''మంచి ఆహారం ఇస్తే విద్యార్థులు చురుగ్గా ఉంటారు. ఏకాగ్రతతో చదువుకుంటారు. సృజనాత్మకతతో ఆలోచిస్తారు.'' అన్న వైస్ ఛాన్సలర్ ఆచార్య రాజశేఖర్ పట్టేటి ఆలోచన ఈ ప్రయోగానికి ప్రేరణ. ఎలాంటి రసాయనిక ఎరువులు వాడకుండా కేవలం సేంద్రియ పద్ధతుల్లో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వంటివి పండించి, వాటిని విద్యార్థులకే అందిస్తూ వారి ఆరోగ్య పరిరక్షణకు యూనివర్శిటీ ప్రతినిధులు కృషి చేస్తున్నారు.

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దటమే కాకుండా వారికి ఆరోగ్యపరమైన వసతి, ఆహారం అందించటం ద్వారా గుంటూరు జిల్లా నాగార్జున నగర్‌లోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వారిని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దుతోంది. 'పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు.' 'పర్యావరణాన్ని రక్షిస్తేనే మన భవిష్యత్తు'. 'మానవ మనుగడ కోసం పర్యావరణ పరిరక్షణకు పాటుపడదాం.' ... ఇలాంటి ఈ నినాదాలు తరచూ మనం వింటూనే ఉంటాం. కానీ..ఈ నినాదాలన్నింటికీ భిన్నంగా ఇక్కడి విసి ఆచార్య రాజశేఖర్ పట్టేటి ఓ ప్రత్యేక నినాదంతో పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించారు. ప్రయత్నం ప్రారంభంలో ఆయన ఒక్కరే.. అయినా వెనకడుగు వేయలేదు. వృక్షో రక్షతి రక్షిత: అంటూ పచ్చదనానికి నిలువెత్తు రూపంగా మారారు.. గత నాలుగేళ్లుగా ఆయన యూనివర్శిటీలో వందలాది మొక్కలు నాటి, నాటించటం ద్వారా ఆదర్శవంతమైన కృషి చేస్తున్నారు.
ఆయన దినచర్య ఉదయం మొక్కల సందర్శనతో మొదలవుతుంది. కొంత సమయం మొక్కలతో గడుపుతారు. మళ్లీ అదే మొక్కలతోనే ఆ రోజూ దినచర్య ముగుస్తుంది. నాటిన మొక్కలు నిర్వీర్యం కాకుండా నీళ్లు పోయించటం, ఆలనా పాలనా వంటివి సిబ్బంది ద్వారా పర్యవేక్షిస్తున్నారు. మొక్కలు నాటితేనే మానవ మనుగడ.. లేకపోతే.. భవిష్యత్తు అంధకారమే.. అందుకే మొక్కలు నాటండి.. అంటూ అవగాహన కల్పిస్తారు.
విద్య, ఆరోగ్యం పరిరక్షణకు ప్రాధాన్యం
విద్యార్థి వికాసానికి విలువలతో కూడిన విద్యా బోధన అవసరం. విద్యార్జనలో విద్యార్థి ప్రగతి చురుకుగా సాగాలంటే అతనికి సంపూర్ణ ఆరోగ్యం ఉండాలి. పరిపూర్ణ ఆరోగ్యం దక్కాలంటే అతనికి పోషక విలువలతో వున్న ఆహారం సదా అందుతూ ఉండాలి. ప్రకృతి రమణీయతకు ఎఎన్‌యుకు మంచి పేరుంది. సేంద్రీయ వ్యవసాయంతో పండించిన ఆకుకూరలు, కూరగాయలతో విద్యార్థులకు ఆహారం అందజేస్తూ మిగతా యూనివర్శిటీలకు ఆదర్శంగా నిలపటానికి వీసీ నిరంతరం కృషిచేస్తున్నారు. ఎన్‌యు హాస్టళ్లలోని విద్యార్థినీ విద్యార్థులకు పోషక విలువలతో కూడిన ఆహారం అందించాలని, సహజ సిద్ధమైన పద్ధతులతో పండించిన ఆహారాన్ని అందించాలని ఆయన ఎఫ్‌ఏసీ వీసీగా ఉన్నప్పుడు ఆలోచించారు. విశ్వవిద్యాలయంలోని మూడు ఎకరాల స్థలంలో కూరగాయలు, ఆకు కూరలు, పండ్ల మొక్కలు నాటించి ఒక కొత్త ఆలోచనకు అంకురార్పణ చేశారు. వాటికి కావాల్సిన పోషణ చేయిస్తున్నారు. గత మూడు సంవత్సరాలుగా సేంద్రియ పద్ధతులతో కూరగాయలు, ఆకు కూరలు పండించి వాటితో హాస్టళ్లలో వండించి, విద్యార్థులకు అందిస్తున్నారు. ఇలా విద్యార్థులకు నాణ్యమైన పోషకాలతో కూడిన ఆహారం అందుతోంది.
ఈ వ్యవసాయ క్షేత్రం సందర్శకులను, ఆచార్యులను, విద్యార్థులను విశేషంగా ఆకర్షిస్తోంది. ప్రకృతి రమణీయతతో హెర్బల్ గార్డెన్, బొటానికల్ గార్డెన్ వంటివి ఆకర్షిస్తున్నాయి. విశ్వ విద్యాలయ రెక్టార్ ఆచార్య పి.వర ప్రసాదమూర్తి, రిజిస్ట్రార్ ఆచార్య బి.కరుణ సైతం తీరిక వేళల్లో పర్యవేక్షిస్తున్నారు. అధ్యాపకులు రాజు సైతం తన వంతుగా కృషి చేస్తున్నారు.

అధ్యాపకులు, జర్నలిజం విభాగం, ఎఎన్‌యు.
విద్యార్థుల ఆరోగ్యం మా బాధ్యతగా భావించాం

దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడి వసతి గృహాల్లో ఉండే విద్యార్థులు అనారోగ్యం పాలు కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. అందుకే మా వంతుగా మూడు ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటలను సాగుచేస్తున్నాం. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, తీగ జాతి కూరలు పండిస్తూ వాటినే వండించి పెట్టడం ద్వారా విద్యార్థులు వారి ఇంట్లో అందే ఆహారంలా భావిస్తున్నారు. మాకు కూడా మంచి పౌష్టికాహారం అందిస్తున్నామనే సంతృప్తి ఉంది. కూరగాయలు పండించటానికి సేంద్రియ ఎరువులను మాత్రమే వాడుతున్నాం. ఆహ్లాదభరిత వాతావరణంలో, అత్యాధునిక సౌకర్యాలతో, నిష్ణాతులతో ఉన్నత విలువలతో ఎఎన్‌యులో విద్యా బోధన జరుగుతోంది.
- ఆచార్య పి.రాజశేఖర్
వైస్ ఛాన్సలర్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం