Nov 08,2023 16:13

హైదరాబాద్‌: ఈ తొమ్మిదిన్నర ఏళ్లలో చూసింది కేవలం ట్రైలర్‌ మాత్రమేనని.. మళ్లీ తమ పార్టీ అధికారంలోకి వస్తే ఐదేళ్లలో 24 గంటలు తాగునీరు సదుపాయం కల్పిస్తామని బిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. సోమాజిగూడలోని ఓ హౌటల్‌లో మల్లాపూర్‌, గాంధీనగర్‌, జీడిమెట్ల, నాచారం, చర్లపల్లి ప్రాంతాలకు చెందిన పారిశ్రామిక వేత్తలతో మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.''కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎన్నో అనుమానాలు ఉండేవి. వీరికి పరిపాలన సాధ్యమవుతుందా? అనుకున్నారు. పదేళ్ల కిందట 10 రోజులు కరెంటు లేకపోయినా అడిగేవారు లేరు. ఇప్పుడేమో 10 నిమిషాలు కరెంటు పోతే ఇదేనా బంగారు తెలంగాణ అంటున్నారు. కర్ణాటక నుంచి నుంచి వచ్చిన ఒకాయనకు సరిగ్గా స్క్రిప్ట్‌ ఇవ్వకపోవడంతో.. మా రాష్ట్రంలో 5గంటల కరెంటు ఇస్తున్నాం అని చెబుతున్నారు. 24 గంటల కరెంటు ఇచ్చే తెలంగాణకు వచ్చి 5 గంటల కరెంటు ఇస్తున్నాం అంటున్నారు. దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే'' అని మంత్రి కేటీఆర్‌ వివరించారు.కొత్త పరిశ్రమలకు ఇచ్చినట్టే పాత కంపెనీలకు కూడా రాయితీలు ఇవ్వాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ను పలువురు పారిశ్రామిక వేత్తలు కోరారు.