Jun 17,2023 09:29

2020 జనవరి 21. కర్ణాటకలోని బీదర్‌లో షాహెన్‌ ఇంగ్లీష్‌ ప్రైమరీ అండ్‌ సెకండరీ స్కూల్లో సాంస్క ృతిక కార్యక్రమాల్లో భాగంగా ఒక లఘు నాటిక ప్రదర్శన జరిగింది. 'మనమంతా మనుషులం.. మనది భారతదేశం.. ఇక్కడ హిందూ, ముస్లిం భాయి, భాయి' అని చెప్పటం ఆ ప్రదర్శన ఉద్దేశ్యం. కానీ, అందులోని కొన్ని డైలాగులను నెపంగా చూపిస్తూ, అప్పట్లో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఆ ప్రదర్శన ఇచ్చిన విద్యార్థుల పైనా, స్కూలు ప్రిన్సిపాల్‌ పైనా, ఓ విద్యార్థిని తల్లి పైనా కేసు బనాయించింది. ప్రిన్సిపాల్‌ని, తల్లినీ జైలు పాల్జేసింది.

          వితంతువైన ఆ తల్లి సంరక్షణలో అప్పటివరకు ఉన్న ఆ పసిది ఆ రోజు నుంచి ఒంటరిదైంది.. ఆ తల్లితో పాటు స్కూలు ప్రిన్సిపాల్‌నీ అరెస్టు చేశారు. 17 రోజులు జైళ్లోనే గడిపిన ఆ ఇద్దరు మహిళలు బయటికి వచ్చినా కేసు నడుస్తూనే ఉంది. మూడేళ్ల నుంచి ప్రిన్సిపాల్‌ ఫరీదా తీవ్ర శారీరక, మానసిక ఒత్తిడితో ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని ప్రతి రోజూ ఆ రోజు జరిగిన కార్యక్రమంలో ఏం తప్పు జరిగిందా అని ఆలోచిస్తూనే ఉంది. ఈ మూడేళ్లలో తమపై మోపిన దేశద్రోహ కేసు ఎలా తొలగిపోతుందా అని ఆ తల్లులు ఎదురు చూడని రోజు లేదు. తాజాగా కర్నాటక హైకోర్టు ఈ కేసుపై విచారణ జరిపి ఆ కేసును కొట్టేసింది. ఇది వారి జీవితంలో సంతోషించదగ్గ అంశం. అయినా ఆనాటి చేదు అనుభవాలు వారిని వెంటాడుతూనే ఉన్నాయి.
 

                                                                        ఆ రోజు ఏం జరిగింది ?

ఆరోజు స్కూలు వార్షికోత్సవం జరుగుతోంది. పండగ వాతావరణం నెలకొని ఉంది. పాటలు, పద్యాలు, నాటికలు, నృత్యాలు వంటి కార్యక్రమాల్లో పిల్లలంతా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. నాలుగు, ఐదు, ఆరు తరగతుల పిల్లల వంతు వచ్చింది. స్టేజీ ఎక్కారు. హిందూ, ముస్లిం ఐక్యమత్యమే దేశ ప్రగతని, అందరూ ఈ దేశ పౌరులేనని చాటి చెబుతూ చిన్న నాటిక వేశారు. చివరలో 'మీ గుర్తింపు కోసం పత్రాలు అడిగిన వారిని చెప్పుతో కొట్టాల'ని ప్రకటించారు. డ్రామా ముగిసింది.
 

                                             ఇందులో ఏదైనా దేశ వ్యతిరేక కార్యకలాపాలు కనిపించాయా ?

కానీ, కార్యక్రమం ముగిసిన ఐదు రోజులకు- జనవరి 26న పౌరసత్వ చట్ట సవరణకు విరుద్ధంగా బీదర్‌ స్కూలు పిల్లలు డ్రామా వేశారని, చట్టం తీసుకొస్తున్న ప్రధాని మోడీని చెప్పుతో కొట్టమని ప్రకటించారని ఆరోపిస్తూ ఓ మత సంస్థకు చెందిన వ్యక్తి స్కూలు యాజమాన్యంపై కేసు ఫైల్‌ చేశాడు. వెంటనే అక్కడి పోలీస్‌స్టేషనులో ఎఫ్‌ఐఆర్‌ నమోదై పోయింది! ఇంకో రెండు రోజుల్లో అది ఏకంగా దేశద్రోహ కేసుగా మారిపోయింది. పాఠశాల ఆవరణలోకి పోలీసులు ప్రవేశించి, దఫదఫాలుగా స్కూలు పిల్లలను విచారించారు. స్కూలు ప్రిన్సిపాల్‌ ఫరిదా బేగం, 11 ఏళ్ల విద్యార్థిని తల్లి 25 ఏళ్ల నజమున్నీసాని అరెస్టు చేశారు.
 

                                                                           వైరల్‌ ఇలా అయింది ..

ఈ ప్రదర్శనను ఒక జర్నలిస్టు సోషల్‌ మీడియాలో లైవ్‌ ఇచ్చాడు. అతడి కొడుకు కూడా ఆ నాటికలో ఓ పాత్రధారి. 'ఎలుకలు నా పత్రాలను తినేశాయి. పిల్లులు ఆ ఎలుకలను తిన్నాయి. కుక్కలు పిల్లిని చంపాయి. మున్సిపాలిటీ వాళ్లు కుక్కలను ఎత్తుకెళ్లారు. కాబట్టి నా పత్రాలు మీ ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి' అని చెప్పిన పిల్లల డైలాగులకు పెద్దలు ఎందరో హర్షిస్తూ, చప్పట్లు కొట్టారు. పౌరసత్వానికి ఆధారం చూపాలంటూ బిజెపి తెచ్చిన చట్టంపై అది వ్యంగ్య విమర్శ. తన కొడుకు పాత్రను వీడియో తీసిన ఓ జర్నలిస్టు దాన్ని సోషల్‌ మీడియాలో పెట్టడంతో- రచ్చ మొదలైంది. ఆ ముస్లిం జర్నలిస్టు ఇదింత పెద్ద విషయమవుతుందని ఊహించలేదు. అందుకే స్కూలుపై కేసు నమోదైన నాటి నుంచి అతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. భయంతో ఏమైపోయాడో.. అతని కుటుంబం ఎక్కడవుందో ఇప్పటికీ తెలియదు.
 

                                                            నజమున్నీసాను ఎందుకు అరెస్టు చేశారు ?

నజమున్నీసా ఒంటరి తల్లి.. 12 ఏళ్లకే వివాహమై 18 ఏళ్లకే భర్త మరణిస్తే బిడ్డను పట్టుకుని బతుకు తెరువు కోసం హళికడ్‌ నుంచి 34 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీదర్‌కి వలస వచ్చింది. వ్యవసాయ కూలీగా పనులు చేసుకుంటూ, బిడ్డను చదివించుకుంటోంది. డాక్టరు కావాలని కలలు కంటున్న ఆ చిన్నారి చదువులో ఎప్పుడూ ముందుండేది. స్కూల్లో జరిగే ప్రతి సాంస్క ృతిక కార్యక్రమంలో పాల్గొనేది. మైనార్టీల్లో వున్న వరకట్న వ్యవస్థ దుష్ప్రభావాలపై కూడా పలు నాటకాలు వేసింది.
         అలా వార్షికోత్సవం రోజున జరిగిన నాటకంలో తన కూతురు పాత్ర చెప్పే 'జూటే మారేంగే' డైలాగును ఇంటిదగ్గర నజమున్నీసా పదే పదే చెప్పించిందని పోలీసులు ఆరోపించారు. అదెలా నిర్ధారణ అయిందంటే.. విద్యార్థులందరినీ స్కూలు ఆవరణలో విచారించిన పోలీసులు నజమున్నీసా కూతురును కూడా ప్రశ్నలు అడిగారు. ఆ డైలాగ్‌ చెప్పినందుకు ఆమెను పదే పదే విచారణకు పిలిచారు. విచారణ గది నుండి ఎప్పుడు బయటికి వచ్చినా ఆ పసిపిల్ల వణికిపోతూ కనిపించేది. రెండు వారాలుగా స్కూల్లో పోలీసులు తిష్టవేయడం సహజంగానే పిల్లల్లో ఎక్కడలేని భయాన్ని తెచ్చింది. 'నేను పోలీసులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానాలే చెప్పాను. ఆ డైలాగు అంత కరెక్టుగా ఎలా చెప్పావు? అని పోలీసలు అడిగారు. అమ్మ ప్రాక్టీస్‌ చేయించిందని చెప్పాను. అది తప్పా.. కాదా.. అన్నారు. తప్పేనని చెప్పాను. నేను జరిగిందంతా చెప్పినా అమ్మను జైళ్లో పెట్టారు. ఎందుకో అర్థం కావడం లేద'ని అమాయకంగా అడుగుతున్న ఆ పిల,్ల జైలు పాలైన తల్లిని గుర్తుకు తెచ్చుకుని గుక్కపెట్టి ఏడ్వడం అక్కడున్న వారిని కలిచి వేసింది.
 

                                                                         ఇప్పుడు ఆ కేసు కొట్టేశారు !

విచారణ పేరుతో చిన్నారులను మానసికంగా వేధించడం సమంజసం కాదని, ఇది వారి భవిష్యత్తుపై తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని అనేక ప్రజాసంఘాలు పెద్దఎత్తున పోరాటం చేశాయి. ఆ మహిళలను విడుదల చేయాలని రాస్తారోకోలు చేశాయి. ఫలితంగా రెండు వారాల తరువాత సెషన్‌ కోర్టు వారిని విడుదల చేసింది. తాజాగా జూన్‌ 14న హైకోర్టు కల్బుర్గి బెంచ్‌ ఆ కేసును కొట్టేసింది.
          దీనిపై ప్రిన్సిపాల్‌ ఫరీదా.స్పందిస్తూ... 'నా జీవితంలో ఎన్నో సంతోషకర సంఘటనలు ఉన్నాయి. కానీ, ఈ రోజు ఇంకా ప్రత్యేకమైనది. ఈ మూడేళ్లలో నేను అనుభవించిన వేదన అంతా ఇంతా కాదు.. ఆరోగ్యం దెబ్బతింది. తీవ్ర ఒత్తిడికి గురై గుండె సమస్య వచ్చింది. ఈ కేసు నా కూతుళ్ల జీవితాలను కూడా ప్రభావితం చేసింది' అంటూ తన బాధను, సంతోషాన్ని ఒకేసారి వ్యక్తపరిచారు.
           నజమున్నీసా మాటల్లో కేసు కొట్టేసిన సంతోషం ఏ కోశానా కనపడ లేదు. 'జైల్లో ఉన్న ఆ 17 రోజులూ ఎంతో నరకం అనుభవించాను. బయటికి వచ్చినా తీర్పు ఎలా వస్తుందోనని రోజూ భయపడుతూనే ఉన్నాను. జైలుకెళ్లినప్పుడు నా కూతురు ఒంటరిగా మిగిలిపోయింది. ఇరుగుపొరుగు వారు, స్కూలు సిబ్బంది అండగా నిలబడినా నా బిడ్డ దిగాలుగా ఉండేది. ఆ భయం ఇప్పటికీ వదలలేదు. ఈ కేసు నా జీవితంపై పెద్ద దెబ్బ వేసింది' అని వాపోయింది.
          ఒక చిన్న సాధారణమైన ప్రదర్శన. వర్తమానంపై చిన్న విమర్శ. దానికే అప్పటి ప్రభుత్వం చెలరేగిపోయింది. విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేసేలా ప్రవర్తించింది. ఏకంగా దేశద్రోహ కేసు బనాయించి, రెండు కుటుంబాలను తీవ్రంగా వేధించింది. ఇప్పుడు సత్యం ఏమిటో తేలింది. కేసు డొల్లతనం తేలిపోయింది. కానీ, ఇద్దరి మహిళల మానసిక క్షోభకు, పసిపిల్లల భయాందోళనల పర్వానికి మూల్యం ఎవరు చెల్లిస్తారు ?