Oct 11,2023 08:59

ఆశ.. ఆకాంక్ష.. అలుపెరగని పట్టుదల.. ఎంతోమందిని ఉన్నత శిఖరాలు అందుకునేలా చేస్తుంది. అలా ఓ రోజు కూలీ చేసుకునే కుర్రాడు మనుగడ కోసం హోటల్లో కప్పులు కడిగే పని చేశాడు. ఉపాధి కూలీగా గుంటలు తవ్వాడు. రోడ్లు వేశాడు. ఇన్ని చేస్తున్నా అతని కళ్ల ముందు మాత్రం ఓ ఉన్నత లక్ష్యం పెట్టుకున్నాడు. ఆ లక్ష్యం దిశగా పరుగులాంటి నడక సాగించాడు. ఇటీవల జరిగిన ఆసియా గేమ్స్‌లో 'రేస్‌ వాక్‌' విభాగంలో మంజురాణితో జంటగా కాంస్య పతకం తీసుకున్న రాంబాబు గురించే ఇప్పుడు మనం చెప్పుకుంటోంది.

త్తరప్రదేశ్‌ సోన్‌భద్ర జిల్లా బెహురా గ్రామానికి చెందిన రాంబాబుది నిరుపేద కుటుంబం. బాబు తండ్రి పారిశుధ్య కార్మికుడిగా నెలకు రూ.3000 నుండి రూ.3500 సంపాదించేవాడు. నలుగురు బిడ్డలున్న ఆ కుటుంబంలో మొత్తం ఆరుగురు సభ్యులు మూడు పూటలా తిండి తినడానికే నానా ఇబ్బందులు పడేవారు. అటువంటి స్థితిలో ముగ్గురు తోబుట్టువుల మధ్య పుట్టిన ఒకే ఒక్క మగపిల్లవాడు రాంబాబు నాన్నకు తోడుగా పొలం బాట పట్టాడు. 'పేదింటి కుటుంబాల్లో ఇదే తంతు జరుగుతుంది. నాన్న పనిచేసేందుకు మాకు స్వంత భూమి లేదు. ఇతరుల పొలంలోకి కూలీగా వెళ్లేవాడు. సీజనల్‌గా పనులు ఉండేవి. ఇలాంటి పరిస్థితుల్లో నేను చదువుపై శ్రద్ద పెట్టకుండా నాన్నతో పొలం వెళ్లేవాడ్ని. కానీ అమ్మ మాత్రం చదివించాలనుకుంది. ఇంటికి దూరంగా హాస్టల్‌లో చేర్పించింది. అలా నేను జవహార్‌ నవోదయ స్కూల్లో చేరాను' అంటున్న రాంబాబు 2012 ఒలింపిక్‌ గేమ్స్‌లో ఇండియా ఆరు పతకాలు సాధించడం, అప్పటివరకు ఏ లక్ష్యమూ లేని తనను ఓ ఉన్నత లక్ష్యం వైపు అడుగులు వేసేలా చేసిందని చెబుతున్నాడు.

                                            ఆ ఒలింపిక్‌ గేమ్స్‌ నా లక్ష్యాన్ని నిర్దేశించాయి

'2012 ఒలింపిక్‌ ప్రసారాలను మా హాస్టల్‌ టీవీలో చూశాను. మరుసటి రోజు మన దేశ విజేతల ఫొటోలను న్యూస్‌పేపర్ల మొదటిపేజీల్లో వేశారు. మేరీ కోమ్‌, సైనా నెహ్వాల్‌, సుశీల్‌ కుమార్‌, గగన్‌ నారంగ్‌ల క్రీడా ప్రయాణాన్ని ఎంతో గొప్పగా రాశారు. అవన్నీ చదివాను. ఆ క్లిప్పింగులను కత్తిరించి జాగ్రత్తగా భద్రపరుచుకున్నాను. ఆ రోజే నా లక్ష్యం నిర్దేశించుకున్నాను. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనుకడుగు వేయకూడదనుకున్నాను' అంటున్న రాంబాబు మొదట్లో పరుగును క్రీడాంశంగా ఎంచుకున్నాడు. 10 వేలు, 5 వేల మీటర్ల పరుగుపందెంలో కూడా పాల్గొన్నాడు. కానీ పోషకాహార లోపంతో బాధపడుతున్న అతనికి మోకాళ్ల నొప్పులు తీవ్రంగా వేధించేవి. దీంతో పరుగు నుండి పరుగు లాంటి నడకను సాధన చేయడం మొదలుపెట్టాడు.
 

                                                            వెయిటర్‌గా అవమానాలుపడ్డాను

ఈ ప్రయాణంలో శిక్షణ కోసం గ్రామాన్ని వదిలి నగరానికి చేరాడు. కోచ్‌ చంద్రబాహన్‌ యాదవ్‌ నిర్వహిస్తున్న అథ్లెటిక్‌ స్టేడియంలో పేరు నమోదు చేసుకున్నాడు. అక్కడే ఓ ఇంట్లో అద్దెకు ఉండేవాడు. 'అమ్మానాన్న ఇంటి నుండి డబ్బులు పంపించేవారు. అయితే అవి ఇంటి అద్దెకే సరిపోయేవి కాదు. దీంతో శిక్షణ ముగిశాక పార్ట్‌టైమ్‌గా ఓ హోటల్లో వెయిటర్‌గా పని చూసుకున్నాను. నెలకు రూ.3000 ఇచ్చేవారు. అర్ధరాత్రి వరకు పనిచేసేవాడ్ని. హోటల్‌కి వచ్చే కస్టమర్లు చాలా అనుచితంగా ప్రవర్తించేవారు. అమర్యాదగా మాట్లాడేవారు. ఇక అక్కడ ఉండలేక గ్రామానికి తిరిగి వచ్చేశాను' అంటూ గతంలో తనకెదురైన చేదు అనుభవాలను గుర్తుచేసుకున్నాడు.
 

                                                           ఉపాధి కూలీగా గుంటలు తవ్వాడు

అవమానాలు పడుతున్నా తన లక్ష్యం మాత్రం విడిచిపెట్టలేదు రాంబాబు. గ్రామానికి వచ్చేశాక, 2020లో నిర్వహించిన 50 కిలోమీటర్ల నేషనల్‌ రేస్‌ వాక్‌ పోటీల్లో పాల్గొని పతకం సాధించాడు. అయితే ఆ తరువాత దేశంలో విధించిన కరోనా లాక్‌డౌన్‌తో పనుల్లేక రాంబాబు కుటుంబం వీధిన పడింది. అప్పుడే గ్రామంలో ఉపాధిహామీ పనులు మొదలయ్యాయి. ఆ పనులకు తండ్రి వెళుతుంటే రాంబాబు కూడా వెంట వెళ్లాడు. 'నాన్నకు పనిలో సాయంగా వెళ్లి గుంటలు తవ్వేవాడిని. రోడ్లు మరమ్మతు పనులు చేసేవాడ్ని. రోజుకు రూ.300 వరకు వచ్చేవి. ఆ సంపాదనే ఆ రోజు మా కుటుంబాన్ని నడిపించింది' అంటున్నాడు.
          మనుగడ కోసం ఒక పక్క పనులు చేయడం, మరోపక్క జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడం అతని దినచర్యగా ఉండేది. 'ఖర్చుల కోసమే పనులు చేసేవాడ్ని. 2021 నుండి వరుసగా పోటీల్లో పాల్గొంటున్నాను. ఈ ప్రయాణంలో నికర ఆదాయం వచ్చే ఉపాధి దొరికితే చాలనుకునేవాడ్ని. కానీ ఇప్పుడు నేను ఎంచుకున్న లక్ష్యం నా కుటుంబానికి, దేశానికి పేరు తెచ్చిపెడుతుందని అసలు ఊహించలేదు' అంటున్నాడు.
 

                                                       శిక్షణ కోసం ఆవుదూడను అమ్మేశారు

నైపుణ్య శిక్షణ ఇస్తే కొడుకు ఇంకా రాణిస్తాడని ఆ తల్లిదండ్రి తమకున్న ఒక్క ఆవుదూడను సంతలో అమ్మేసి అకాడెమీ శిక్షణకు పంపించారు. ఆనాటి సంఘటన ఇప్పుడు గుర్తుచేసుకుంటూ తల్లిదండ్రులు ఆనందంతో ఆనందభాష్పాలు రాలుస్తున్నారు.
'నా బిడ్డ ఎప్పుడో ఒకప్పుడు విజయం సాధిస్తాడని నాకు తెలుసు. అయితే అది ఇంత త్వరగా వస్తుందని మాత్రం ఊహించలేదు. ఇప్పుడు నా బిడ్డ పేరు మీదే ఓ రికార్డు ఉంది. ఇది తలచుకుంటేనే ఆనందంతో నా కాళ్లు తేలిపోతున్నాయి' అంటోంది రాంబాబు తల్లి. ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా, పేదరికం వేధిస్తున్నా రాంబాబు తన పరుగు ఆపలేదు. నడకనే పరుగుగా చేసుకుని పతకాలు సాధిస్తున్నాడు. ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.