
సర్వాధికారై
సర్వమానవ కళ్యాణమై
సర్వాస్త్ర భూషితై
సత్యమేవ జయతే అంటూ ధర్మశాస్త్రంలో
న్యాయం లిఖితమైంది!
శాస్త్రకోవిదుడు చదువుతాడు
చిగురించిన మెదడు
రెమ్మ కొమ్మలై విస్తరిస్తుంది
ధర్మక్షేత్రంలో ఒక విశ్లేషణ
చట్టసభల్లో ఒక సమర్పణ
సభాస్థలిలో ఒక సారాంశం
న్యాయం వివిధాలై
సవ్య అపసవ్య భ్రమణం!
న్యాయం తర్ఫీదైన మర్కటం
తీగపై నడుస్తుంది
గెంతుతుంది దూకుతుంది
భువిలో సర్కస్ చేస్తుంది
కళను ఆస్వాదించిన చేతులు
బహుమతిగా డబ్బు విసిరిన చోట
రెండు కాళ్ళపై నిలబడి
వినయంగా నమస్కరిస్తుంది!
న్యాయం శిక్షణైన గంగిరెద్దు
అందంగా అలంకరణై
కలవారింట కోసేపు చిందులేసి
అయ్యగారికి దండమై
మోకాళ్ళపై నమస్కరించి
పారితోషికం అందాక
దీవెనై తలూపుతుంది!
న్యాయం ధనాడ్యుడి పాదాల చెంత
పెంపుడు శునకమై పొదుగుతుంది!
ధనహీనుడిపై బడి
జాతి జాగిలమే
కండను పెకలిస్తుంది!
న్యాయం ఒకచోట దృశ్యం
ఒక చోట అదృశ్వం
ఒకచోట కొనుగోలు
ఒక చోట అమ్మకం !
- అడిగోపుల వెంకటరత్నమ్
98482 52946