- నత్తనడకన హోటల్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ నిర్మాణం
- నిధుల విడుదలలో కేంద్రం తీవ్ర జాప్యం
ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి : కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో హోటల్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. హోటల్ మేనేజ్‌మెంట్ రంగంలో నిరుద్యోగులకు అవకాశాలు దక్కాలనే ఉద్దేశంతో మన రాష్ట్రంలో తొలిసారిగా ఈ ఇన్‌స్టిట్యూట్ నిర్మాణం చేపట్టారు. అయితే, పనుల్లో పెద్దగా ప్రగతి లేదు. నిధుల విడుదలలో కేంద్ర ప్రభుత్వ జాప్యం, సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ఇందుకు ప్రధాన కారణం. 2014లో అప్పటి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి చొరవతో స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ సంస్థ రాష్ట్రానికి మంజూరైంది. దీన్ని కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం మూలపేటలో నిర్మించేందుకు తొలుత నిర్ణయించారు. రూ.12 కోట్ల సిఎఫ్‌ఎ (సెంట్రల్ ఫైనాన్స్ అసిస్టెంట్) నిధులు కేటాయించారు. రూ.8 కోట్లు తరగతి భవనాలకు, రూ.2 కోట్లు హాస్టల్ భవన నిర్మాణానికి, మరో రూ.2 కోట్లు మౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చు చేయాలని నిర్ణయించారు. కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో మూలపేట నుంచి ఈ భవనాన్ని ఉప్పాడ హైస్కూలు ప్రాంగణంలోకి మార్చారు. 2015లో టిడిపి హయాంలో అప్పటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు అక్కడ శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.1.50 కోట్ల ఖర్చుతో పిల్లర్ల వరకూ పనులు జరిగాయి. హైస్కూల్ స్థలంలో నిర్మాణం సరికాదని స్థానికులు కొందరు కోర్టును ఆశ్రయించడంతో పనులకు బ్రేక్ పడింది.
2018లో ఇన్‌స్టిట్యూట్‌కు మూడు ఎకరాలు కేటాయించేలా న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. అయినా, దాదాపు నాలుగేళ్ల వరకూ నిర్మాణ పనులు ముందుకు కదలలేదు. గతేడాది అక్టోబరు నుంచి మళ్లీ పనులు ప్రారంభమైనా నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.4 కోట్లు మాత్రమే విడుదల కావడంతో పనుల్లో జాప్యం జరిగిందని అధికారులు చెబుతున్నారు. నిధుల విడుదలలో జాప్యం కారణంగా ఇది ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి ఉంది. ఇది పూర్తయితే మూడేళ్ల హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు 80 మంది, ఏడాదిన్నర డిప్లొమా కోర్సులు 200 మంది చదువుకునే అవకాశం ఉంది.
డిసెంబరు నాటికి పూర్తి చేస్తాం
ఇన్‌స్టిట్యూట్ నిర్మాణానికి న్యాయపరమైన చిక్కులన్నీ తొలగిపోయిన తర్వాత పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం రూ.4 కోట్లు నిధులు మాత్రమే విడుదలయ్యాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
- పసుపులేటి పొసయ్య,
పర్యాటక శాఖ జిల్లా ఇన్‌ఛార్జి అధికారి










