Aug 18,2023 11:28

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : తక్షణం అగనంపూడి టోల్‌ గేటును తొలగించాలని కేంద్ర బిజెపి, రాష్ట్ర వైసిపి ప్రభుత్వాలను డిమాండ్‌ చేస్తూ ఆగష్టు 21వ తేదీ ఉదయం 6.30 గంటలకు అగనంపూడి టోల్‌ గేట్‌ వద్ద భారీ ధర్నాను సిపిఎం చేపట్టనుందని 78 వ వార్డు కార్పోరేటర్‌ బి.గంగారావు ప్రకటించారు.

శుక్రవారం ఉదయం మద్దిలపాలెంలోని సిపిఎం కార్యాలయం నిర్వహించిన మీడియా సమావేశంలో గంగారావు మాట్లాడుతూ .... గత అనేక ఏళ్లుగా అక్రమంగా, చట్టవిరుద్ధంగా అగనంపూడి టోల్‌ గేట్‌ కొనసాగుతున్నదన్నారు. మున్సిపల్‌ కార్పోరేషన్‌ పరిధిలో టోల్‌ గేట్లు ఉండకూడదనే నిబంధనలను కూడా ధిక్కరిస్తూ కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్నదని ఆగ్రహాని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున ప్రజలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు, వాహనదారులు, స్టీల్‌ ప్లాంట్‌, ఫార్మాసిటీ, విఎస్‌ఇజెడ్‌, అచ్యుతాపురం ఎస్‌ఇజెడ్‌ సంస్థలు, ఉద్యోగులు, యాజమాన్యాలు పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం కోరుతున్నదని పిలుపునిచ్చారు.