Oct 06,2023 22:20

- 'సెంచరీ'కి చేరువలో భారత్‌
- ఆర్చరీ, స్క్వాష్‌లలో పతకాలు
హాంగ్జౌ: 19వ ఆసియా క్రీడల్లో 'సెంచరీ' పతకాలే లక్ష్యంగా వెళ్లిన భారతజట్టు ఆ ఫీట్‌కు చేరువైంది. శుక్రవారం 13వ రోజు పోటీలు ముగిసే సరికి భారత్‌ 95 పతకాలతో నాల్గోస్థానంలో నిలిచింది. మరో రెండురోజుల్లో భారత్‌కు మరిన్ని పతకాలు దక్కడం ఖాయం. తాజాగా పురుషుల హాకీజట్టు స్వర్ణ పతకాన్ని సాధించగా.. క్రికెట్‌, కబడ్డీ, బ్యాడ్మింటన్‌ పురుషుల డబుల్స్‌లో భారతజట్టు ఫైనల్‌కు చేరుకోవడంతో పతకాలు ఖాయమయ్యాయి. దీంతో ఈసారి అత్యధిక పతకాల 'సెంచరీ' మార్క్‌ను భారత్‌ అందుకోవడం పక్కా.
శుక్రవారం జరిగిన పురుషుల హాకీ ఫైనల్లో భారతజట్టు 5-1గోల్స్‌తేడాతో జపాన్‌ను చిత్తుచేసింది. ఈ మ్యాచ్‌ ఆసాంతం భారత్‌ ఆధిపత్యమే కొనసాగింది. భారత ఫార్వర్డ్‌లు పదే పదే జపాన్‌ గోల్‌ పోస్ట్‌ పై దాడులు చేస్తూ ఒత్తిడి పెంచారు. ఈ మ్యాచ్‌ లో భారత్‌ తరఫున తొలి గోల్‌ను మన్‌ ప్రీత్‌ సింగ్‌(25వ ని.)లో సాధించాడు. అమిత్‌ రోహిదాస్‌(36వ ని.), హర్మన్‌ ప్రీత్‌ సింగ్‌(32, 59వ ని.) రెండు గోల్స్‌ కొట్టాడు. అభిషేక్‌ 48వ నిమిషంలో ఒక గోల్స్‌ సాధించారు. జపాన్‌ తరఫున 51వ నిమిషంలో సెరెన్‌ తనాకా ఏకైక గోల్‌ నమోదు చేశాడు. ఆసియా క్రీడల్లో పురుషుల జట్టు స్వర్ణం గెలవడం ఇది నాలుగోసారి. 1966, 1998, 2014 ఆసియా క్రీడల్లోనూ భారత్‌ విజేతగా నిలిచింది.
ఆర్చరీ రికర్వ్‌ పురుషుల టీమ్‌ విభాగంలో భారత బృందం ఫైనల్లో నిరాశపరిచింది. ఉత్కంఠభరిగా సాగిన ఫైనల్లో అతాను దాస్‌, ధీరజ్‌, తుషార్‌లతో కూడిన భారత్‌ 1-5 తేడాతో దక్షిణ కొరియా చేతిలో ఓటమిపాలైంది. దీంతో రజత పతకం దక్కించుకోగలిగింది. కాంస్య పతక పోటీలో ఇండోనేషియా 6-0తో బంగ్లాదేశ్‌ను చిత్తుచేసింది. ఇక అంకిత, భజన్‌, సిమ్రన్‌జీత్‌లతో కూడిన మహిళల రికర్వు జట్టు 6-2తో వియత్నాంను ఓడించి కాంస్య పతకాన్ని చేజిక్కించుకుంది. ఈ విభాగంలో కొరియాకు స్వర్ణం, చైనాకు రజత పతకం దక్కాయి. కాంపౌండ్‌ మిక్స్‌డ్‌, టీమ్‌ విభాగాల్లో వెన్నం జ్యోతి సురేఖ స్వర్ణ పతకాల్ని సాధించిన సంగతి తెలిసిందే.
రెజ్లింగ్‌లో సోనమ్‌కు కాంస్యం
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్‌ పతకాల సంఖ్య 91 కి చేరింది. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన మహిళల 65 కేజీల ఫ్రీ స్టైల్‌ విభాగం కాంస్య పతక పోరులో భారత రెజ్లర్‌ సోనమ్‌ మాలిక్‌ చైనా రెజ్లర్‌ లాంగ్‌ జియాను ఓడించి పతకం దక్కించుకుంది. ఈ పోరులో సోనమ్‌ 7-5 తేడాతో చైనా రెజ్లర్‌ను మట్టి కరిపించింది. సెపక్‌తక్రా ఈవెంట్‌లో భారత మహిళా జట్టు కాంస్యం గెలుచుకుంది.

p

బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో ప్రణయ్ సెమీస్‌లో ఓటమిపాలయ్యాడు. దీంతో ప్రణయ్ కాంస్య పతకానికే పరిమితమయ్యాడు. క్రికెట్‌, కబడ్డీ విభాగాల్లో భారత్‌కు స్వర్ణ పతకాలు దక్కడం ఖాయం. అలాగే బ్యాడ్మింటన్‌ పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జోడీ సెమీస్‌లో చైనా జోడీని చిత్తుచేసింది. అలాగే పురుషుల కబడ్డీ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీస్‌లో భారత్‌ 61-14పాయింట్ల తేడాతో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది.
క్రికెట్‌లో ఫైనల్లో భారత్‌..
క్రికెట్‌లో పురుషుల హాకీజట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో భారతజట్టు 9వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 96 పరుగులే చేసింది. సాయి కిషోర్‌కు మూడు, సుందర్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ లక్ష్యాన్ని టీమిండియా 9.2ఓవర్లలో వికెట్‌ కోల్పోయి ఛేదించింది. రుతురాజ్‌(40; 26బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్లు), తిలక్‌ వర్మ(55; 26బంతుల్లో 2ఫోర్లు, 6సిక్సర్లు) అజేయంగా నిలిచి మ్యాచ్‌ను ముగించారు. క్వార్టర్‌ఫైనల్లో సెంచరీ కొట్టిన జైస్వాల్‌ ఈ మ్యాచ్‌లో డకౌటయ్యాడు.
12వ రోజు పోటీలు ముగిసే సరికి భారత్‌ 95పతకాలతో నాల్గో స్థానంలో నిలిచింది. ఇందులో 22స్వర్ణ, 34రజత, 39కాంస్య పతకాలున్నాయి. శనివారం భారత్‌కు మరో 9 పతకాలు దక్కనున్నాయి. దాంతో ఈసారి భారత్‌ సెంచరీ మార్క్‌కు చేరడం ఖాయం.

పతకాల్లో భారత్‌కు 'సెంచరీ' ఖాయం
ఆసియా క్రీడల్లో భారత జట్టు నయా చరిత్రను నెలకొల్పనుంది. ఆసియా క్రీడల్లో ఎన్నడూ రాని విధంగా తొలిసారి మూడంకెల పతకాలను సాధించే దిశగా భారత్‌ దూసుకెళ్తోంది. ఈసారి 'వంద' పతకాలే లక్ష్యంగా భారత అథ్లెట్లు బరిలోకి దిగారు. జకార్తా వేదికగా 2018లో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్‌ అత్యధికంగా 70 పతకాలు సాధించింది. ఈసారి క్రీడల్లో ఆ రికార్డును అధిగమించనుంది. పోటీలు ముగియడానికి మరో రెండు రోజుల వ్యవధి ఉండగా.. భారత్‌ ఖాతాలో ఇప్పటికే 91 పతకాలు వచ్చి చేరాయి. ఇందులో 21స్వర్ణ, 33రజత, 36కాంస్య పతకాలు ఉన్నాయి.