Mar 01,2023 20:17

హైదరాబాద్‌ : మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఇఐఎల్‌) అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌ (ఒజిఎల్‌) తయారు చేసిన హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్‌ టిప్పర్లు ఇకపై రోడ్లపై పరుగెత్తనున్నాయి. ఈ టిప్పర్లకు హోమోలోగేషన్‌ సిర్టిఫికెట్‌ పొందినట్లు ఆ కంపెనీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. భారతీయ ఆటోమొబైల్‌ నియంత్రణ సంస్థల నుంచి ఆమోద సర్టిఫికెట్‌ లభించిందని వెల్లడించింది. కేంద్ర మోటారు వాహన నింబంధనలకు అనుగుణంగా.. ఒలెక్ట్రా 6ఞ4 హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్‌ టిప్పర్‌ రోడ్డుపైకి వచ్చేందుకు అవసరమైన అన్ని అనుమతులు సాధించామని ఆ సంస్థ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కెవి ప్రదీప్‌ తెలిపారు. ''ఒలెక్ట్రా తయారు చేసిన దేశంలోనే తొలి ఇ-టిప్పర్‌ మన రహదారులకు అనువైనదో లేదో తెలుసుకునేందుకు పర్వత ప్రాంతాలు, ఎత్తయిన ప్రదేశాలు, మైనింగ్‌, క్వారీతో సహా వివిధ ప్రాంతాలలో పరీక్షలు చేసి సర్టిఫికెటును జారీ చేశారు. భారత్‌లో ఎలక్ట్రిక్‌ హెవీ వెహికల్‌ సెగ్మెంట్‌లో ఒలెక్ట్రా ప్రధాన పాత్ర పోషిస్తోందని, తమ సంస్థలో తయారైన ఇ-టిప్పర్‌ దేశంలోనే మొట్టమొదటి సర్టిఫైడ్‌ హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్‌ టిప్పర్‌గా నిలిచింది.'' అని ప్రదీప్‌ చెప్పారు. ఈ-టిప్పర్‌ ప్రోటోటైపును ఢిల్లీ, బెంగుళూరులో ప్రదర్శించామని.. ఇది ఔత్సాహికులకు గొప్ప ఉత్సుకతను, ఆసక్తిని కలిగించిందని ప్రదీప్‌ తెలిపారు. 20 ఎలక్ట్రిక్‌ ఇ-టిప్పర్ల మొదటి ఆర్డర్‌కు సంబంధించి ఒక సంస్థతో చర్చలు తుది దశలో ఉన్నాయని వెల్లడించారు. త్వరలో ఆ వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఇ-టిప్పర్‌, ఎలక్ట్రిక్‌ ట్రక్కుల్లో వివిధ వేరియంట్‌లను కూడా విడుదల చేయబోతున్నామని.. తమ ప్రయాణంలో ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని అన్నారు. ఒలెక్ట్రా ఎలక్ట్రిక్‌ టిప్పర్‌.. నిర్మాణం, మౌలిక సదుపాయాలు, మైనింగ్‌, క్వారీ రంగాలలో గణనీయమైన మార్పును తీసుకురాబోతున్నాయని కెెవి ప్రదీప్‌ వెల్లడించారు. డీజిల్‌, పెట్రోల్‌ వాహనాలతో పోలిస్తే ఒలెక్ట్రా ఎలక్ట్రిక్‌ టిప్పర్‌ మొత్తం వ్యయం తక్కువ ఖర్చుతో కూడుకున్నదన్నారు.