
- లేకపోతే రానున్న ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : ఎన్నికల ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని.. లేదంటే రానున్న ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ ఎం ఎల్ సి,బొడ్డు నాగేశ్వరావు స్పష్టం చేశారు. ఒపిఎస్ సాధనకై యుటిఎఫ్ కృష్ణా జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక యుటిఎఫ్ కార్యాలయంలో గురువారం నిరవధిక నిరాహార దీక్షలను బొడ్డు నాగేశ్వరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బొడ్డు నాగేశ్వరావు మాట్లాడుతూ.. పెన్షన్ అనేది ఉద్యోగి హక్కు అని, భిక్ష కాదని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో 3.5 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు సిపిఎస్ విధానంలో పని చేస్తున్నారని ప్రభుత్వ జి పి ఎస్ విధానంతో వీరంతా తీవ్రంగా నష్టపోతారని అవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వారంలోపు రద్దు చేస్తానని ప్రతిపక్ష నేత హౌదాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్ల తరువాత మాట మార్చారని విమర్శించారు. పైగా సిపిఎస్ రద్దు చేయకుండా జిపిఎస్ విధానాన్ని తీసుకొచ్చారని ఈ విధానాన్ని ఉద్యోగులు ఎవరు అంగీకరించడం లేదన్నారు. 2004 లో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి సి పి ఎస్ అమలు పైల్ పై సంతకం పెట్టినప్పుడే యు టి ఎఫ్ తీవ్రంగా వ్యతిరేకించిందని గుర్తు చేశారు.కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించి నిరవధిక సమ్మెలు విరమింప చేయాలని డిమాండ్ చేశారు. యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కే ఏ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పెన్షన్ కొనసాగితే రాష్ట్ర ఖజానా దివాళా తీస్తుందని. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదయోగ్యం లేని వాదనలు చెబుతోందన్నారు. వీటిని తాము వ్యతిరేకిస్తున్ననన్నారు. ఇప్పటికే రాజస్థాన్, చత్తీస్ గఢ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్ర ప్రభుత్వాలు సిపిఎస్ నుంచి ఓపిఎస్ లోకి వచ్చాయని గుర్తు చేశారు. యు టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు బి కనకారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్ ఇచ్చే వరకు నిరవదిక దీక్షలు కొనసాగిస్తామన్నారు. జిల్లా అధ్యక్షులు బి.కనకారావు, జిల్లాకార్యదర్శలు ఎన్.వెంకటేశ్వరరావు,టి. సీతారామయ్య, అబ్దుల్ హబీబ్, ఎల్. సుభాషిణి, పెడన అధ్యక్షులు టి.పాపయ్య, బాపులపాడు సహధ్యక్షులు పి.జగతి, పెడన కార్యవర్గసభ్యులు సిహెచ్. శ్రీనివాసరావు ఈ దీక్షల్లో కుర్చున్నారు. ఏపీ సిపిఎస్ ఈఏ జిల్లా అధ్యక్షులు కొక్కిలిగడ్డ నాంచారయ్య , యు టి ఎఫ్ గౌరవ అధ్యక్షులు నీలం ప్రభాకర్ రావు , యు టి ఎఫ్ సహాధ్యక్షులు ఎం డి షౌకత్ హుస్సేన్ ,యుటిఎఫ్ కొశాధికారి మరీదు వరప్రసాద్‌లు పాల్గొన్నారు.