Oct 30,2023 21:05

కనీస చెల్లింపులు, భద్రతలోనూ అంతంతే
ఫెయిర్‌ వర్క్‌ ఇండియా రిపోర్ట్‌
న్యూఢిల్లీ : ఓలా, ఉబర్‌, పోర్టర్‌లను అత్యంత చెత్త వేదికలుగా గిగా వర్కర్స్‌ భావిస్తున్నారని ఓ రిపోర్ట్‌లో వెల్లడయ్యింది. టెక్నాలజీ రవాణ కంపెనీలు ఓలా, పోర్టర్‌కు కేవలం సున్నా పాయింట్లు, ఉబర్‌, డుంజోకు ఒక్క పాయింటు చొప్పున మద్దతు లభించిందని 'ఫెయిర్‌వర్క్‌ ఇండియా 2023' రిపోర్ట్‌లో వెల్లడయ్యింది. ఆక్స్‌ఫర్డ్‌తో కలిసి సెంటర్‌ ఫర్‌ ఐటి అండ్‌ పబ్లిక్‌ పాలసీ (సిఐటిఎపిపి), ఐఐఐటి బెంగళూరు ఓ రిపోర్ట్‌ను రూపొందించాయి. గిగ్‌ వర్కర్ల పని పరిస్థితులను పరిశీలించి దీన్ని విడుదల చేశాయి. ఈ సంస్థలు పలు డిజిటల్‌ వేదికలపై మెరుగైన చెల్లింపులు, మంచి పరిస్థితులు, ఫెయిర్‌ కాంట్రాక్ట్స్‌, మంచి మేనేజ్‌మెంట్‌, ఫెయిర్‌ ప్రాతినిధ్యం (రిప్రజెంటేషన్‌) తదితర ఐదు అంశాలపై అమెజాన్‌ ఫ్లెక్స్‌, బిగ్‌ బాస్కెట్‌, బ్లుస్మార్ట్‌, డుంజో, ఫ్లిప్‌కార్ట్‌, ఓలా, పోర్టర్‌, స్విగ్గీ, ఉబెర్‌, అర్బన్‌ కంపెనీ, జెప్టో, జమాటో తదితర 12 సంస్థలపై అధ్యయనం చేసి ఓ నివేదికను రూపొందించిందని బిజినెస్‌ స్టాండర్డ్‌ ఓ కథనం ప్రచురించింది. గిగా వర్కర్ల సౌలభ్యాలపై 10 పాయింట్లకు గాను స్కోర్‌ నిర్ణయంచింది. ఏ ఒక్క సంస్థ కూడా ఆరు పాయింట్లకు మించి సంపాదించుకోలేక పోయింది.
బిగ్‌ బాస్కెట్‌ అత్యధికంగా ఆరు పాయింట్లను సాధించగా.. ఆ తర్వాత స్థానాల్లో బ్లూస్మార్ట్‌, స్విగ్గీ, అర్బన్‌ కంపెనీ, జమాటో సంస్థలు ఐదు పాయింట్ల చొప్పున నమోదు చేసుకున్నాయి. ఉబెర్‌ 10 పాయింట్లకు ఒక్క పాయింట్‌, ఓలా, పోర్టర్‌లు సున్నా పాయింట్లతో అథమ స్థానంలో నిలిచాయి. మెరుగైన చెల్లింపుల్లో ఏ ఒక్క సంస్థ కూడా స్కోర్‌ చేయలేదు. బిగ్‌ బాస్కెట్‌, ఫ్లిప్‌కార్ట్‌, అర్బన్‌ కంపెనీలు మాత్రమే కనీస వేతన విధానాన్ని కలిగి ఉన్నాయి. వాటి కార్మికులు ఇంధనం, వాహన నిర్వహణ, బీమా, డేటా వంటి పని సంబంధిత ఖర్చులతో సహా పని గంటల తర్వాత అదనపు పని గంటకు కనీస వేతనం పొందేలా చూసుకుంటున్నాయి. 12 వేదికల్లో ఏడు మాత్రమే కార్మికులకు 'ఫెయిర్‌ కాంట్రాక్ట్‌లను' అందిస్తున్నాయి.
రోడ్డు ప్రమాదాలు, గాయాలు, దొంగతనం, నేరం. హింస, ప్రతికూల వాతావరణ పరిస్థితులు వంటి అనేక ప్రమాదాలను గిగ్‌ కార్మికులు ఎదుర్కొంటున్నారు. అమెజాన్‌ ఫ్లెక్స్‌, బిగ్‌బాస్కెట్‌, బ్లూస్మార్ట్‌, ఫ్లిప్‌కార్ట్‌, స్విగ్గీ, ఉబెర్‌, అర్బన్‌ కంపెనీ, జెప్టో, జమాటోతో సహా 9 ప్లాట్‌ఫారమ్‌లు కార్మికులకు తగిన భద్రతా పరికరాలు, శిక్షణను అందించడం ద్వారా ప్రమాదాలను తగ్గించేలా కృషి చేస్తున్నాయని ఈ రిపోర్ట్‌ పేర్కొంది. బిగ్‌ బాస్కెట్‌, స్విగ్గీ, జెప్టో, జమాటో సంస్థలు మాత్రమే తమ వర్కర్లకు ఎలాంటి ఖర్చు లేకుండా ప్రమాద బీమాను కల్పిస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు, ఇతర వైద్య కారణాల వల్ల వారు పని చేయలేని సందర్భాల్లో ఆదాయ నష్టానికి పరిహార మద్దతను అందిస్తున్నాయి. గిగా వర్కర్ల భద్రత, సంక్షేమం కోసం దేశంలో తొలిసారి రాజస్థాన్‌ ప్రభుత్వం మాత్రమే చట్టం చేసిందని ఈ రిపోర్ట్‌ గుర్తు చేసింది. ఇది వారికి సామాజిక భద్రత, ఇతర ప్రయోజనాలను కల్పిస్తుందని పేర్కొంది.