Sep 06,2023 12:39

యానాం (కాకినాడ) : తొలకరి పడింది.. గోదారి ఎరుఎక్కింది.. ఈ సీజన్‌ పులసల సీజన్‌.. ఇంకేముందీ ... ' ఆయ్... పులస చేప పడ్డాదండీ... ఈసారి రేటు ఎంతనుకున్నారేటీ... అచ్చరాలా.. రూ.26 వేలు.. ఆయ్ '...

         మళ్లీ యానాంలో 15 రోజుల తరువాత పులస సందడి చేసింది. పులస పడిందంటే చాలు... మత్స్యకారులతోపాటుగా, మాంసాహార ప్రియులంతా యానాం పుష్కరఘాట్‌ వద్దకు వచ్చేస్తారు. వేలంపాటలో ఎవరు ఎక్కువ పాడుకుంటే వారిదే ఆ పులస. తినగానే నోట్లో సుతిమెత్తగా జారిపోతూ అత్యంత రుచికరంగా ఉండే ఈ పులస కోసం అంతా పోటీపడతారంటే.. అతిశయోక్తి కాదండోయ్..! అయ్..బాబోయ్.. ఈసారి పులస రేటు ఎక్కువ పలికి రికార్డులోకెక్కేసింది..!
          నిన్న (మంగళవారం) సాయంత్రం యానాం పుష్కరఘాట్‌ వద్ద ఓ మత్స్యకారుడు ఆదినారాయణ వలకు రెండు కెజిల బరువున్న పులస చిక్కింది. ఇంకేముంది ఆ జాలరి పంట పండింది. ' నా పంట పండిపోనాదిరా '... అంటూ ... ఆ జాలరి చేపను వేలంలో పెట్టాడు. కొల్లు.నాగలక్ష్మి అనే మహిళ వేలంపాటలో నెగ్గి రూ.19 వేలకు పులస చేపను దక్కించుకుంది. ఇంతలో ... ఆ పులస చేప రావుపాలెంకు చెందిన ఓ ప్రముఖ నేతకు కావాలంటూ.. ఓ వ్యక్తి వచ్చి నాగలక్ష్మితో మాట్లాడి ఆ పులసకు అదనపు రేటును చేర్చి మొత్తంగా రూ.26 వేలకు కొన్నాడు. అదండీ పులస రాజకీయ నాయకుడి కోసం పోనాది..!