యానాం (గోదావరి) : సముద్ర చేపల రుచుల్లో ... రారాజుగా పిలిచే భారీ పండుగప్ప చేప .. యానాం గోదావరి మత్స్యకారుల గాలానికి చిక్కింది. ఇంకేముంది ఆ మత్స్యకారుల పంట పండింది.. గోదావరి పండుగప్ప అంటే ... ఎవరైనా లొట్టలేయాల్సిందే.. మాంచి రుచి దీని ప్రత్యేకత..! ఈ చేప బరువు దాదాపు 15 కెజిలుగా ఉంది. స్థానిక ఇందిరాగాంధీ మార్కెట్లో మత్స్యకారుల గాలానికి చిక్కిన ఈ భారీ చేపను ... పోలమండ భద్రం, రత్నం దంపతులు వేలం పాడి రూ.9 వేలకు దక్కించుకున్నారు.

ఇది రెండోసారి..!
గోదావరిలో దొరికే ఈ పండుగప్ప చేప మాంచి రుచిగా ఉండటంతో మాంసప్రియులు దీనిని కొనడానికి పోటీపడ్డారు. గతంలో 20 కెజిల పండుగప్ప దొరగ్గా... ఇప్పుడు 15 కెజిల పండుగప్ప దొరకడంతో మత్స్యకారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. శుభకార్యాల్లో ... పులస, పులుసు తరహాలో పండుగప్ప చేప వేపుడు ముక్కల వంటకాన్ని మాంసప్రియులు ఇష్టంగా తింటారు. యానాం గోదావరిలో ఇంత గొప్ప భారీ పండుగప్ప దొరకడం ఇది రెండోసారి.
పండుగప్ప మాంసాహారం మాత్రమే తింటుందట..!
పండుగప్ప అనేది సముద్రం చేప. దీనికి ఒక్కటే వెన్నుపూస ముల్లు ఉంటుంది.. పక్కటి ముళ్లు అస్సలుండవు... చాలా మెత్తగా ఉంటుంది. నోట్లో ఇట్టే కరిగిపోతుంది.. సముద్రపు ఉప్పు నీటితోపాటు మంచి నీటి నదులలో పెరగడం పండుగప్ప ప్రత్యేకత. పండుగప్ప మాంసాహారం మాత్రమే తింటుందట. ఈ చేపను తింటే శరీరానికి కావాల్సిన చాలా ప్రొటీన్లు అందుతాయట. పులుసు, ఫ్రై చేయడంతో పాటు ఉప్పు చేపగా కూడా దీన్ని తింటారు. ఈ భారీ చేపను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు.










