హైదరాబాద్ : ప్రతీ సంవత్సరం ఆస్తమా వ్యాధిగ్రస్తులకు అందించే చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ప్రారంభమయ్యింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ చేపల ప్రసాదం రేపు ఉదయం 8 వరకు కొనసాగనుంది. ఉబ్బసం, ఆయాసం వంటి వ్యాధిగ్రస్తులకు బత్తిని కుటుంబ సభ్యులు ఈ చేప మందును ఉచితంగా పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తున్నది. బత్తిని కుటుంబాలకు చెందిన దాదాపు 250 మందితో పాటు పలు స్వచ్ఛంద సంస్థల వారు కౌంటర్ల ద్వారా చేప ప్రసాదాన్ని అందజేస్తున్నారు. ఇందుకోసం 32 కౌంటర్లను ఏర్పాటు చేశారు. దాదాపు వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
మూడు సంవత్సరాల విరామం తరువాత మళ్లీ ఈరోజు....
కరోనా నేపథ్యంలో మూడు సంవత్సరాల విరామం తర్వాత మళ్లీ ఈరోజు చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. ఈ చేప ప్రసాదం కోసం రెండు లక్షల మంది వరకు వచ్చే అవకాశం ఉంది. ఒక రోజు ముందుగానే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది గురువారమే తరలిరావడంతో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కిక్కిరిసింది. వీరికి పలు స్వచ్ఛంద సంస్థలు భోజన వసతులు కల్పించాయి. ప్రభుత్వం పకడ్భందీగా ఏర్పాట్లు చేసింది. తెలంగాణ మత్స్యశాఖ ఆధ్వర్యంలో 1.5 లక్షల కొర్రమీను చేపలను అందుబాటులో ఉంచారు. అదనంగా మరో 75 వేల చేప పిల్లలతోపాటు.. అవసరమైతే మరిన్ని చేప పిల్లలను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
ఆర్టీసీ ప్రత్యేక బస్సులు...
చేప మందు పంపిణీ నేపథ్యంలో .... ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. మొత్తం 32 క్యూలైన్ల ద్వారా ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. నాంపల్లి గ్రౌండ్ పరిసరాల్లో 700 వరకు సీసీ కెమెరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెండు రోజులపాటు దాదాపు 300 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. 10వ తేదీవరకు నగరంలోని సికింద్రాబాద్ స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, జేబీఎస్, ఎంజీబీఎస్, ఈసీఐఎల్ ఎక్స్ రోడ్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు వంటి ప్రాంతాల నుంచి దాదాపు 50 బస్సులను ఏర్పాటు చేశారు. అలాగే మరో 14 ప్రాంతాల నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు 80 బస్సులను నడుపుతున్నారు.
కంట్రోల్ రూం...
ప్రజల సౌకర్యార్థం పోలీసులు ఒక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. వేలాది మంది జనం రావడంతో వారికి ఇబ్బంది కలగకుండా కంట్రోల్ రూంలు పోలీస్ శాఖ అంత సమాచారాన్ని ఇస్తున్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు అశ్విన్ మార్గం ఆధ్వర్యంలో చేప ప్రసాదానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు, పలు స్వచ్ఛంద సంస్థలు సహకారాన్ని అందిస్తున్నాయి.
ఎగ్జిబిషన్‌కు వచ్చే వాహనాలు దారి మళ్లింపు...
పాత బస్తీ నుంచి ఎంజే మార్కెట్ మీదుగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు వచ్చే వాహనాలను ఇతర ప్రాంతాల మీదుగా శుక్రవారం దారిమళ్లించినట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ట్రాఫిక్ డీసీపీ అశోక్ కుమార్, ఏసీపీ కోటేశ్వర్‌రావు, ఇన్‌స్పెక్టర్ గురునాథ్‌లు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ట్రాఫిక్ దారిమళ్లింపుపై గురువారం పర్యవేక్షణ జరిపి పరిస్థితులను సమీక్షించారు. ఆర్టీసీ పలు ప్రాంతాల నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు.
స్వచ్ఛంద సంస్థల చేయూత... హెల్త్ క్యాంపులు...
నగరంలోని పలు స్వచ్ఛంద సంస్థలు చేయూత అందించనున్నాయి. చేప ప్రసాదానికి వచ్చే ప్రజలకు అల్పాహారాలు, భోజనాలు, తాగునీరు, మజ్జిగను పంపిణీ చేస్తున్నాయి. ఆరోగ్యశాఖ అధికారులు హెల్త్ క్యాంపును ఏర్పాటు చేశారు. ప్రజలకు ఎలాంటి హెల్త్ సమస్యలు ఉన్నా 4 అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచారు.










