ఒకతూరి ఇట్లా సూడండి
తిట్లను పుట్లు పుట్లు పోగేసి
మైకులకు మూతులానిస్తిరి
ఎకసెక్కాల ఇసుర్లను
ఒకరిపైనొకరు సల్లుకుంటా
ఏలుబడిని ఏమార్చితిరి
పెద్ద పెద్ద అచ్చరాలకు రంగులేసి
లక్షణంగా భుజాలెగరేస్తిరి
గచ్చనగాయాటలన్నీ
గుచ్చి గుచ్చి సూపెడ్తా
బుల్లితెరకు దండలేసి సూస్తిరి
అయ్యా దొరా
ఈడ ఈడ్చలేని భారంతో
రాష్ట్ర శరీరం సాగిలపడినాది
కాయింత సూపు సారించండి
కుదింపులు మదింపులంటూ
అదిలింపులకు దారేస్తిరి
అక్కడ ఇక్కడ చేయి సాపి
గాలాన్కి బతుకుల్ని తగిలిస్తిరి
యాడనో యాలాడే ద్రాక్షకు
చేతులు సాపి తినమంటిరి
ఈడ దేకనీకి నయాపైసా లేదు
కదల్డానికి ఇసుమంత ఊపిర్లేదు
గద్దెనెక్కినకాడనుంచి
గెద్దెలు ఇనడాన్కే సాలాయే
నేల బతుకులు మారకపాయే
అయ్యా దొరా
ఇంగైనా మట్టి మనిషి వైపు
కన్నెత్తి నేరుగా సూడండి
అలసిన బతుకులకింత
గంజి పోసే యత్నం సేయండి
- నరెద్దుల రాజారెడ్డి
ఫోన్: 9666016636










