Nov 25,2022 08:28
  • దశాబ్దాల నాటి విద్యుత్తు తీగలు, స్తంభాలు
  • వెంటాడుతున్న సిబ్బంది కొరత
  • 20 రోజుల వ్యవధిలో 'అనంత'లో ఏడుగురు మృతి

ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : ఉమ్మడి అనంతపురం జిల్లాలో కాలం చెల్లిన తీగలు, విద్యుత్తు సామాగ్రి ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. 1963 ప్రాంతంలో వేసిన విద్యుత్తు స్తంభాలు, తీగల (కండక్టర్సు)ను మార్చకుండా అలాగే కొనసాగిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సుమారు 10 వేల నుంచి 20 వేల వరకు పాత విద్యుత్తు స్తంభాలు, 3400 కిలోమీటర్ల మేర విద్యుత్తు తీగలు ఆరు దశబ్దాల నుంచి కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో తరుచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. 20 రోజుల వ్యవధిలోనే ఏడుగురు మరణించారు.
 

                                                        హెచ్‌విడిఎస్‌లోనే అత్యధిక ప్రమాదాలు

2016లో ప్రపంచబ్యాంకు నిధులతో అనంతపురం, కర్నూలు జిల్లాలో హెచ్‌విడిఎస్‌ (హైఓల్టేజీ డిస్ట్రిబ్యూసన్‌ సిస్టమ్‌) కింద రూ.1658 కోట్లతో వ్యవసాయ మోటర్లకు ప్రత్యేకంగా విద్యుత్తు లైన్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచారు. 2018 నుంచి పనులు కొనసాగుతూనే ఉన్నాయి. వ్యవసాయానికి మెరుగైన విద్యుత్‌ను అందించే పేరుతో ఈ పనులను చేపడుతున్నారు. ఇందుకు సంబంధించి 725 వ్యవసాయ ఫీడర్ల కింద పనులు చేపట్టారు. అయితే ఈ కొత్త లైన్‌లు ఏర్పాటు చేసే సమయంలో పాత ఎల్టీ లైన్స్‌నే వేస్తున్నట్టు సమాచారం. కాలం చెల్లించినవి కావడంతో చాలాచోట్ల అతుకులు కనిపిస్తున్నాయి. ఈ అతుకుల్లో నాణ్యత లేని తీగల్లో విద్యుత్తు సరఫరా అయినప్పుడు ఎగుడు, దిగుడులు వచ్చినా... ఏదైనా కాకి, ఉడత షార్టు చేసినా వెంటనే తెగి పడిపోతున్నాయి. తెగిన వెంటనే విద్యుత్‌ సరఫరాని నిలిపివేసే బ్రేకర్లు సరిగాలేకపోవడంతో యథావిధిగా విద్యుత్తు సరఫరా అయ్యి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
 

                                                         వెంటాడుతున్న సిబ్బంది కొరత

ఇంతటి ప్రధానమైన విద్యుత్తు శాఖలోనూ క్షేత్రస్థాయి సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 650 సర్వీసులు, పట్టణాల్లో వెయ్యి సర్వీసులకు ఒక పర్యవేక్షణ సిబ్బంది ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో నాలుగు వేల సర్వీసులకు ఒకరు, గ్రామీణ ప్రాంతాల్లో పది వేల సర్వీసులకు ఒకరు చొప్పున పర్యవేక్షణ సిబ్బంది మాత్రమే ఉన్నాయి. కొన్ని చోట్ల నాలుగు నుంచి పది గ్రామాలకు ఒకరు మాత్రమే ఉన్నారు. దీంతో పర్యవేక్షణ సైతం కొరవడుతోంది. ఒక్క అనంతపురం జిల్లా పరిధిలోనే 55 లైన్‌మెన్‌, 308 ఎఎల్‌ఎం, 275 జెఎల్‌ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక ఇంజినీర్ల కొరత కూడా తీవ్రంగా ఉంది.
 

                       ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం : సురేంద్ర, ఎస్‌ఇ, విద్యుత్‌ శాఖ

ప్రమాదాల నివారణకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలోనున్న 1070 ఫీడర్ల పరిధిలోనూ సర్వేలు చేపడుతున్నాం. ఎటువంటి సమస్యలున్నాయని పరిశీలిస్తున్నాం. వీటన్నింటినీ పరిశీలించి ప్రమాదాలు చోటు చేసుకోకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటాం. జూన్‌ నెలలో సత్యసాయి జిల్లాలోని తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద విద్యుత్‌ తీగ తెగి ఆటోపై పడిన ఘటనలో ఐదు గురు సజీవ దహన మయ్యారు. పెద్దపప్పూరు మండలంలో ఒకరు, కూడేరు మండలంలో ఒకరు అక్టోబరులో చనిపోయారు. నవంబర్‌ 2న బొమ్మనహల్‌ మండలంలోని దర్గాహొన్నూరు వద్ద ఐదుగురు మృతి చెందారు. అదే గ్రామంలో బుధవారం ఓ మహిళా మరణించారు. తాజాగా కల్యాణదుర్గం మండలం హుళికల్లు గ్రామానికి చెందిన రైతు వడ్డే రామాంజనేయులు(49) తన పంటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. ట్రాన్స్‌ఫార్మర్‌లో పోయిన ఫీజు మార్చుతుండగా విద్యుత్‌ షాక్‌కు గురై మరణించారు.