Jun 25,2023 09:54

గొర్రిపూడిలో తొమ్మిదో తరగతి చదువుతున్న సోమరాజు, ఎనిమిదో తరగతి చదువుతున్న నూకరాజు కాకినాడ పట్నం వెళ్లారు. ఆ రోజు అన్ని వీధులు తిరిగినప్పటికీ, ఏ బుక్‌ షాపుల్లోనూ సోమరాజుకు కావలసిన భూగోళ శాస్త్రం వాచకం దొరకలేదు.
'అయ్యో ఆ వాచకం ఇప్పుడే అయిపోయింది! అది తర్వాత వస్తదమ్మా' అని చెప్పారు షాపుల వాళ్లు. నిరాశతో ఇద్దరూ ఇంటి దారి పట్టారు. కాళ్లు ఈడ్చుకుంటు గొర్రిపూడి చేరుకున్నారు. ఓ జామ చెట్టు దగ్గర జామకాయలు కోసుకొని తినసాగాడు నూకరాజు. 'నువ్వు కూడా తినరా అంటూ సోమరాజుకు ఓ జామకాయ ఇచ్చాడు.
'ఏం జాంకాయ తినడం రా. నాకు కావాల్సిన పుస్తకం దొరకలేదు. బడిలో మాస్టారుకు. ఇంట్లో అమ్మా నాన్నకు ఏం చెప్పాలి' అంటూ తల గోక్కోసాగాడు సోమరాజు.
'అవును రోయ్.. జామకాయ తింటుంటే నాకు ఆలోచన వచ్చింది, మా అన్నయ్య బడి మానేస్తాడంట మాస్టర్‌ గారి దెబ్బలు తట్టుకోలేకపోతున్నాడు అంట! మా అన్నయ్య తొమ్మిదో తరగతే కదా, ఆ వాచకం ఉంది. మా ఇంటికెళ్లి, అన్నయ్యను అడిగి నీకు ఆ పుస్తకం ఇస్తాను' అన్నాడు నూకరాజు.
'అయ్యో.. మీ అన్నయ్య బడి మానేస్తాడా? అయినా బడిలో పిల్లలను కొట్టకుండా ఉంటే బాగుండు.' అన్నాడు సోమరాజు.
'అవును బడిలోనూ పుస్తకాలు ఇస్తే బాగుండు, కొనుక్కుందామన్న పుస్తకాలు ఇప్పుడు దొరకడం లేదు' అన్నాడు నూక రాజు.
'అయితే మీ అన్నయ్య పుస్తకం కొనుక్కుంటాను రా' అన్నాడు సోమరాజు.
'కొనడం ఎందుకులే.. నీవు ఈ సంవత్సరం చదువుకున్నాక, నాకు ఇచ్చేయ్. వచ్చే సంవత్సరం నాకు ఉపయోగపడుతుంది కదా! మళ్లీ కొనాలన్నా ఆ పుస్తకం దొరుకుతుందో! లేదో?' అనుకుంటూ ఇంటికి చేరారు. ఇంటికెళ్లి వాళ్ళ అన్నయ్యను అడిగి ఆ పుస్తకం తెచ్చి ఇచ్చాడు నూకరాజు.
అలా సోమరాజు, నూకరాజులు పెరిగి, పెద్దయ్యాక సోమరాజు ఇస్రోలో ఇంజనీర్‌గా, నూకరాజు వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు!. మేటి పౌరులుగా నిలిచారు.
- అమ్మిన వెంకట అమ్మిరాజు
94407 08656