తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నిర్వహించే ఆర్జిత సేవల లక్కీడిప్‌లో టికెట్లు పొందిన యాత్రికులు ఇకపై ఆన్‌లైన్‌లో నగదు చెల్లించి వాటిని తీసుకోవచ్చు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు లక్కీడిప్ ద్వారా పొందిన ఆర్జిత సేవా టికెట్లను పొందిన యాత్రికులు తిరుమలలోని సెంట్రల్ రిజర్వేషన్ కార్యాలయానికి (సీఆర్‌ఓ) నేరుగా వెళ్లి కౌంటర్ వద్ద నగదు చెల్లించి టికెట్లు తీసుకోవాల్సి ఉండేది. ఇలా టికెట్లు పొందే ప్రక్రియలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు యాత్రికుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. ఇకపై ఈ విధానంలో యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నూతన విధానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అందుబాటులోకి తీసుకొచ్చింది.నూతన విధానంలో ''పే లింక్'' ఎస్‌ఎంఎస్ ద్వారా యాత్రికులు కౌంటర్ల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా ఆన్‌లైన్‌లోనే సొమ్ము చెల్లించి సేవా టికెట్లను ప్రింట్ తీసుకోవచ్చని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. మొదటగా యాత్రికులకు ఎస్‌ఎంఎస్ ద్వారా 'పే లింక్'ను తిరుమల తిరుపతి దేవస్థానం పంపిస్తుంది.యాత్రికులు ఈ లింక్‌పై క్లిక్ చేసి యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా ఆన్‌లైన్‌లో నగదు చెల్లించి సేవా టికెట్లు ప్రింట్ తీసుకోవచ్చు. ఈ నూతన విధానాన్ని ప్రస్తుతం సీఆర్‌ఓలోని లక్కీడిప్ కౌంటర్ల వద్ద ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. త్వరలో ఎంబీసీ-34 కౌంటర్ వద్ద విచక్షణ కోటాలో కేటాయించే ఆర్జిత సేవా టికెట్లు, బ్రేక్ దర్శన టికెట్లకు కూడా ఈ నూతన విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.










