పాట్నా : బీహార్‌లోని ముజఫర్ నగర్ గ్రామీణ ఉపాధి కార్మికులు (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ) రుణాల ఊబిలో కూరుకుపోతున్నారు. వేతనాల చెల్లింపులు లేకపోవడంతో జీవనోపాధి కోసం ప్రైవేట్ వ్యక్తుల నుండి అధిక వడ్డీకి రుణాలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కొందరికి గత ఐదు నెలల నుండి వేతనాలు లేకపోవడంతో కుటుంబ సభ్యులకు కనీసం రెండు పూటలా భోజనం కూడా అందించలేకపోతున్నామని కార్మికులు వాపోతున్నారు. ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎను పర్యవేక్షిస్తున్న స్థానిక ఎన్‌జిఒ కార్మికుల నుండి సేకరించిన వివరాలతో ఓ నివేదికను రూపొందించినట్లు జాతీయ మీడియా బుధవారం తెలిపింది.
ఈ నివేదికపై స్పందించిన జిల్లా అధికారులు కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖకు నిధులు మంజూరు కాలేదని చెబుతూ చేతులు దులుపుకున్నారు. అయితే ముజఫర్‌పూర్‌లో 93 శాతం మంది కార్మికులు ఇప్పటికే వేతనాలు పొందారని అన్నారు. అయితే స్థానిక ఎన్‌జిఒ ఈ వ్యాఖ్యలను కొట్టిపారేసింది. గైఘాట్, బోచాహా, కుర్హానీతో సహా జిల్లాలోని పలు బ్లాకుల్లో సుమారు 25,000 మంది కార్మికులకు నెలల తరబడి వేతనాలు అందలేదని ఎన్‌జిఒ తెలిపింది.
మహ్మద్‌పూర్ సురా పంచాయితీ పరిధిలోని ధబౌలీ గ్రామానికి చెందిన సుదామా దేవీ కార్మికులు పడుతున్న అవస్థలను వివరించారు. తన ఐదుగురు పిల్లల కోసం ఆహారం కొనేందుకు కూడా నగదు లేదని అన్నారు. నాసిరకం బియ్యం, నీరు , ఉప్పుతో కడుపునింపుకుంటున్నామని చెప్పారు. స్థానిక వడ్డీ వ్యాపారి నుండి అధిక వడ్డీకి రూ. 5,000 అప్పు తీసుకున్నానని అన్నారు. మార్చినుండి జులై వరకు 45 రోజుల పనికి సుమారు రూ. 10,000 దాకా వేతనాలు రావాల్సి వుందని ..కానీ ఇప్పటి వరకు అందలేదని గైఘాట్ బ్లాక్ లోని బీరువా పంచాయితీకి చెందిన మరో మహిళ తెలిపారు. సుమారు కార్మికులందరిదీ ఇదే పరిస్థితని... రుణాల ఊబిలో కూరుకుపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ చెల్లింపులు జరిగినా అధిక వడ్డీలు చెల్లించేందుకే సరిపోవని .. ఇక మా పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.










