తిరుమల: నవంబరు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. ఇందులో భాగంగా సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన ఆర్జిత సేవల ఆన్‌లైన్ లక్కీడిప్ కోసం ఆగస్టు 19వ తేదీ ఉదయం 10 గంటల నుండి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకునేందుకు వీలుకల్పించింది. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన యాత్రికులు సొమ్ము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మౌత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవాటికెట్లను ఆగస్టు 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. వర్చువల్ సేవా టికెట్లను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఆగస్టు 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం టికెట్లను ఉదయం 11 గంటలకు, వఅద్ధులు, వికలాంగులకు దర్శన టోకెన్ల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లను ఆగస్టు 24వ తేదీ ఉదయం 10 గంటలకు, తిరుమల తిరుపతిలలో వసతి గదులను బుక్ చేసుకునేందుకు బుకింగ్‌ను ఆగస్టు 25వ తేదీ ఉదయం 11 గంటలకు అనుమతిస్తారు. ఈ విషయాలు గమనించి https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన విడుదల చేసింది.










