Nov 10,2023 14:40

తిరుపతి: శ్రీవారి యాత్రికులకు డిసెంబరు 23 నుంచి జనవరి 1వ తేదీ వరకూ తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌ లైన్‌లో వైకుంఠ ద్వార దర్శన టికెట్లను విడుదల చేసింది. కేవలం 21 నిమిషాల్లోనే ఈ టికెట్లు అయిపోవడం విశేషం. మొత్తం 2.25 లక్షల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లకు శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో ఉంచింది. ఈ టికెట్లకు యాత్రికుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. కేవలం 14 నిమిషాల వ్యవధిలోనే 80 శాతం టికెట్ల అమ్మకాలు పూర్తయ్యాయి. మరోవైపు టీటీడీ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లను కూడా అందుబాటులోకి తీసుకువస్తోంది. సాయంత్రం 5 గంటలకు వసతి గదుల కోటాను విడుదల చేయనున్నారు.
మరోవైపు తిరుపతిలోని 9 కేంద్రాల్లో 100 కౌంటర్లలో డిసెంబరు 22వ తేదీన వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను యాత్రికులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. మొత్తం 4.25 లక్షల టికెట్లను ప్రత్యేక కేంద్రాల ద్వారా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఇక డిసెంబర్‌ 23 నుంచి 1వ తేదీ వరకూ ప్రత్యేక దర్శనాలైన చంటిపిల్లలు, వికలాంగులు, వయోవఅద్ధులు, ఎన్‌ఐఆర్‌ల దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.