తిరుపతి : తిరుమల కొండమీద సామాన్యులకు కేటాయించే గదులకు సౌకర్యాలు పెంచి వీఐపీల ధరలు నిర్ణయించామని టిటిడి యాజమాన్యం చెప్పడం విడ్డూరంగా ఉందని, సామాన్యులకు కేటాయించబడ్డ గదులను వారికే కొనసాగించాలని తిరుపతి సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. విఐపి జోన్లో సామాన్యులకు ప్రవేశం లేకుండా చేసినట్టుగా తయారైందని నాగరాజు విమర్శించారు. టిటిడి యాజమాన్యం పునరాలోచన చేయాలని, సామాన్యుల గదులను వారికే కేటాయించాలని కోరారు. బిజెపి మత సమస్యగా చిత్రీకరించి ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి చేస్తున్న ప్రయత్నాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తున్నదని అన్నారు. ధరల పెంపు సమస్యను కాకుండా దీనికి మతం రంగు పులిమి ఓ పక్షాన్ని రెచ్చగొట్టే రీతిలో బిజెపి వైఖరి ఉందని ఇది నష్టం చేకూరుస్తుందన్నారు. ప్రజలు బిజెపి తప్పుడు వైఖరిని గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా వివాదాలకు తావు లేకుండా టిటిడి యాజమాన్యం, టిటిడి బోర్డు బాధ్యతగా వ్యవహరించాలని ప్రకటనలో నాగరాజు కోరారు










