Jan 04,2023 08:21
  • హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వలేం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మత మార్పిడులన్నీ చట్ట విరుద్ధం కాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మత మార్పిడి సమయంలో తప్పనిసరిగా జిల్లా మేజిస్ట్రేట్‌ (డిఎం) ముందు డిక్లరేషన్‌ చేయాలంటూ మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన మత స్వేచ్ఛ చట్టం అవసరాన్ని కొట్టివేస్తూ మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు తీర్పుపై మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను మంగళవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ సిటి రవి కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. ''అన్ని మత మార్పిడులు చట్టవిరుద్ధమని చెప్పలేం. నోటీసు జారీ చేయడంతోపాటు మధ్యంతర ఉపశమనం ఇస్తాం. ఫిబ్రవరి 7న విచారిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కౌంటర్‌ ఉంటే దాఖలు చేయాలి' అని ధర్మాసనం పేర్కొంది. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం తరపు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదిస్తూ ''వివాహం లేదా మత మార్పిడిపై ఎలాంటి నిషేధం లేదు. జిల్లా మేజిస్ట్రేట్‌కు మాత్రమే సమాచారం ఇవ్వాలి. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలి'' అని కోరారు. దీనికి ధర్మాసనం బదులిస్తూ, దీనిని తాము స్వీకరించలేమని, రాష్ట్రం వద్ద ఏదైనా కౌంటర్‌ ఉంటే తదుపరి విచారణ తేదీన సమర్పించవచ్చని పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 7కి వాయిదా వేసింది. చట్టంలోని సెక్షన్‌ 10 (మత మార్పిడికి ముందు ప్రకటన)ను ఉల్లంఘించే ఏ వ్యక్తిపైనా బలవంతపు చర్య తీసుకోవద్దని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సుజోరు పాల్‌, జస్టిస్‌ ప్రకాష్‌ చంద్ర గుప్తాలతో కూడిన ధర్మాసనం నవంబర్‌ 14న ఇచ్చిన ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ''పరివర్తనను కోరుకునే పౌరుడు జిల్లా మేజిస్ట్రేట్‌కు ఈ విషయంలో డిక్లరేషన్‌ ఇవ్వడాన్ని సెక్షన్‌ 10 తప్పనిసరి చేస్తుంది. ఇది మా అభిప్రాయం ప్రకారం రాజ్యాంగ విరుద్ధం. వయోజన పౌరులు వారి స్వంత ఇష్టానుసారం వివాహం చేసుకుంటే, చట్టంలోని సెక్షన్‌ 10ని ఉల్లంఘించినందుకు బలవంతపు చర్య తీసుకోకూడదు'' అని హైకోర్టు పేర్కొంది. ఈ చట్టం రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న సమయంలో హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.