Sep 14,2023 22:12

హాంగ్జూ: సుదీర్ఘ కాలంగా క్రీడలకు దూరంగా ఉన్న ఉత్తర కొరియా మనసు మార్చుకుంది. వచ్చే వారం నుంచి చైనా వేదికగా జరిగే ఆసియా క్రీడల్లో ప్రాతినిధ్యం వహించనుంది. ఈ క్రీడల్లో 191మందితో ప్రాతినిధ్యం వహించనున్నట్లు నిర్వాహకులకు తెలియజేసింది. ఈ మేరకు ఆసియా క్రీడల నిర్వాహకులకు 191మందితో కూడిన ఉత్తర కొరియా జట్టును ప్రకటించనున్నట్లు సంతకాలు చేసిన లేఖను పంపింది. అథ్లెటిక్స్‌, జిమ్నాస్టిక్స్‌, బాస్కెట్‌బాల్‌, ఫుట్‌బాల్‌, వెయిట్‌లిఫ్టింగ్‌తో సహా పలు క్రీడల్లో తమ అథ్లెట్లు ప్రాతినిధ్యం వహించనున్నట్లు ఆ లేఖలో పేర్కొంది. 2020లో కరోనా వ్యాప్తి కారణంగా ఉత్తర కొరియా సరిహద్దులను మూసివేసింది. ఈ క్రమంలోనే 2021 ఒలింపిక్స్‌కూ తమ అథ్లెట్లను పంపలేదు. దీంతో అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ 2022 బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌లో పాల్గనకుండా ఉత్తర కొరియాపై నిషేధం విధించింది. గత నెలలో కజకిస్తాన్‌ వేదికగా జరిగిన టైక్వాండో పోటీల్లో ఉత్తర కొరియా జట్టు ప్రాతినిధ్యం వహించడంతో సరిహద్దు పరిమితులను సడలించినట్లు తెలిసింది. సెప్టెంబర్‌ 19న జరిగే ఫుట్‌బాల్‌ పోటీల్లో ఉత్తర కొరియా జట్టు తైవాన్‌తో తలపడనుంది. ఇక ఆసియా క్రీడలు ఈనెల 23నుంచి చైనాలోని హాంగ్జూ వేదికగా ప్రారంభం కానున్నాయి.