నాగార్జున వర్సిటీలో నాన్‌టీచింగ్ స్టాఫ్ : రిటైర్మెంటు వయసు 62 ఏళ్లు : హైకోర్టు
ప్రజాశక్తి-అమరావతి : నాగార్జున విశ్వవిద్యాలయంలోని బోధనేతర సిబ్బంది రిటైర్మెంటు వయసు 62 ఏళ్లుగా పరిగణించాలని వర్సిటీకి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంటు వయసు 62కు పెంపు చేసినా వర్సిటీలో బోధనేతర సిబ్బంది ఉద్యోగ విరమణ వయసు 60 ఏళ్లుగా పరిగణిస్తూ వర్సిటీ రిజిస్ట్రార్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పలువురు రిట్లు దాఖలు చేశారు. డిప్యూటీ రిజిస్ట్రార్లు, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు, సీనియర్ అసిస్టెంట్లు, లైబ్రరీ అసిస్టెంట్లు దాఖలు చేసిన రిట్లపై జస్టిస్ కె మన్మధరావు తీర్పు చెప్పారు. ఉద్యోగ విరమణ వయసు 60కు పరిమితం చేయడం చెల్లదన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా వర్సిటీ విసి నిర్ణయం తీసుకున్నారని, కానీ వర్సిటీ రిజిస్ట్రార్ మాత్రం ఉద్యోగ విరమణ వయసు 60 ఏళ్లుగానే పరిగణించడం చెల్లదని పిటిషనర్ల అడ్వకేట్ ఎస్ లక్ష్మీనారాయణరెడ్డి వాదించారు. ఉద్యోగ విరమణ వయసు తగ్గింపుపై రిజిస్ట్రార్‌కు నిర్ణయం తీసుకునే అధికారం లేదని, వర్సిటీ పాలక మండలి తీసుకోవాలని చెప్పారు. పిటిషనర్ల వాదనతో హైకోర్టు ఏకీభవించింది.
రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లోకి అనుమతి నిరాకరణ ఉత్తర్వులు రద్దు
రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ల ఆఫీసుల్లోకి డాక్యుమెంట్ రైటర్లు, స్టాంపుల విక్రయదారులకు ప్రవేశాన్ని నిలిపివేస్తూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌శాఖ కమిషనర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ అమలును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. కొందరు అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి మొత్తం డాక్యుమెంట్ రైటర్లందరికీ ఆఫీసుల్లోకి అనుమతి లేకుండా చేయడం సబబు కాదని చెప్పింది. మూకుమ్మడిగా నిలిప ివేత రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించేలా, హక్కు లను హరించేలా ఉందని జస్టిస్ దొనడి రమేష్ తీర్పు చెప్పారు. రిజిస్ట్రేషన్‌శాఖ కమిషనరు 2021 డిసెంబరు 17న జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను ఎపి డాక్యుమెంట్ రైటర్ల వెల్‌ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పివి సుబ్బారావు, ఇతరులు వేర్వేరుగా సవాల్ చేశారు.










