Feb 16,2023 21:07

న్యూఢిల్లీ : దేశంలో 5జి వినియోగదారుల్లో భారీ పెరుగుదల చోటు చేసుకుంటుందని నోకియా తెలిపింది. 2024 కల్లా 15 కోట్ల 5జి వినియోగదారులు నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది. టెలికం సంస్థలు కూడా ఇందుకోసం వేగంగా విస్తరిస్తున్నాయని పేర్కొంది. ఈ ఏడాది చివరకు దాదాపు దేశంలోని అన్ని ప్రాంతాల్లో 5జి సేవలు అందుబాటులోకి రావొచ్చని వెల్లడించింది. 2జి వినియోగదారులు క్రమంగా తగ్గుతున్నారని తెలిపింది. 2024 కల్లా దేశంలో 4జి, 5జి వినియోగదారుల సంఖ్య 99 కోట్లకు చేరొచ్చని పేర్కొంది. ఇదే సమయంలో 2జి వాడకందారులు 15 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేసింది. ప్రస్తుతం దేశంలో 2 కోట్ల మంది 5జి వినియోగదారులున్నారని తెలిపింది. దేశంలో గతేడాది దీపావళి నుంచి 5జి సేవలు ప్రారంభమైన విషయం తెలిసిందే. 5జి రాకతో దేశంలో డేటా వినియోగం భారీగా పెరుగుతోందని తెలిపింది.