- మండుటెండలో పని చేస్తున్నాం
- కాళ్లు, చేతులకు గాయాలవుతున్నాయి
- పని ప్రదేశంలో వసతులు కల్పించడంలేదు
- ఎపి వ్యవసాయ కార్మిక సంఘం నేతల ఎదుట కార్మికుల ఆవేదన
ప్రజాశక్తి-యంత్రాంగం : మండుటెండలో పని చేస్తున్నామని, పని ప్రదేశంలో కాసేపు సేద తీరేందుకు నీడ.. తాగేందుకు నీళ్లు ఉండడంలేదని, మెడికల్ కిట్లు అందుబాటులో లేవని, వేసవి భత్యం, వేతనంపై పే స్లిప్పులు ఇవ్వడంలేదని, కూలి బకాయిలు చెల్లించడంలేదని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం నాయకుల ఎదుట ఉపాధి కార్మికులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ఎండ తీవ్రతకు రెండు పూటలా పనులు చేయడం కష్టంగా ఉందని వాపోయారు. కాళ్లు, చేతులకు గాయాలవుతున్నా పని చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎపి వ్యవసాయ కార్మిక సంఘం నేతలు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం పర్యటించారు. ఉపాధి కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం పొన్నాడ సమీపంలోని కవి చెరువులో చేపడుతున్న ఉపాధి హామీ పనులను సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్ పరిశీలించారు. ఉపాధి కార్మికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పని ప్రదేశంలో తాగునీరు, టెంట్లు ఇతర మౌలిక సదుపాయాలు లేవని ఆయన దృష్టికి వారు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా తులసీదాస్ మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టానికి సాంకేతిక సమస్యలను సృష్టించి కార్మికులను పనులకు దూరమయ్యేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలిపారు. ఫేషియల్ అటెండెన్స్, మొబైల్‌లో మస్తర్లు వంటి టెక్నికల్ అంశాలను తీసుకొచ్చి ఉపాధి హామీ పథకాన్ని నిలిపివేయాలని మోడీ చూస్తున్నారని విమర్శించారు. మోడీ చర నుంచి ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర, నంబులపూలకుంట, గోరంట్ల, రొద్దం తదితర మండలాల్లో నాయకులు పర్యటించి ఉపాధి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బిల్లుల చెల్లింపులు సక్రమంగా జరగడం లేదని, పనిప్రదేశాల్లో కనీస వసతులు లేవని, నిబంధనల పేరుతో ఉపాధి పని దినాలను తగ్గించే కుట్రలు చేస్తున్నారని ఉపాధి కార్మికులు నాయకుల ఎదుట వాపోయారు. ప్రకాశం జిల్లా టంగుటూరులో ఉపాధి కార్మికులు మాట్లాడుతూ గతంలో సమ్మర్ అలవెన్స్, మంచినీళ్లకు రూ.5, గడ్డపారకు రూ.15, తట్ట, పారకు రూ.5 ఇచ్చేవారని, ప్రస్తుతం వాటిని నిలిపివేశారని తెలిపారు. నెల్లూరు జిల్లా కావలి మండలం కొన్నదిన్నె గ్రామంలో పని ప్రదేశంలో మజ్జిగ, మంచినీరు ఇవ్వలేదని, పని సరిగా కల్పించడంలేదని, వంద రోజులు పని అనేది ఆచరణలో ఉండటం లేదని వాపోయారు. పశ్చిమగోదావరి పోడూరులో ఉపాధి కూలీలు మాట్లాడుతూ ప్రభుత్వం పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలేదని తెలిపారు.










