Aug 19,2023 10:38

 ఏచూరి నేతృత్వంలోని సిపిఎం బృందం తొలిరోజు పర్యటనలో దృశ్యాలు 

బాలింతలకు సౌకర్యాలు కరువు..  ఆ శిశువులే వారి ఆశాదీపాలు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :  మూడు మాసాలైనా మణిపూర్‌ ప్రజలను భయం, అభద్రత ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. బాధితులను పరామర్శించేందుకు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నేతృత్వంలోని ఆ పార్టీ ప్రతినిధి బృందం రెండురోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం అక్కడికి వెళ్లింది. తొలిరోజు చురచంద్‌పూర్‌లో సహాయక శిబిరాలను సందర్శించిన బృందం బాధితులెవరిని కదిలించినా కన్నీళ్లు, రోదనలే. వారిని ఓదార్చి, మీకు అండగా ఉన్నామని భరోసా ఇచ్చింది.
సహాయక శిబిరాల్లో పసికందుల పరిస్థితి మరీ దారుణం. సర్వస్వం కోల్పోయిన కుటుంబాలకు ఆ శిశువులే ఆశాదీపాలు. చురచంద్‌పూర్‌లోని సెడాన్‌, చంపై క్యాంపుల్లోనే మూడున్నర నెలల్లో 12 మంది శిశువులు జన్మించారు. అల్లర్లు చెలరేగిన మే 3వ తేదీ రాత్రి జైదాన్‌ హమర్‌ యూత్‌ అసోసియేషన్‌ హాల్‌లో శిబిరం ప్రారంభమైంది. ఆ శిబిరాన్ని సందర్శించిన సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నేతృత్వంలో బృందానికి అక్కడి పరిస్థితి గురించి సహాయక సిబ్బంది వివరిస్తూ... ''తల్లులు, శిశువులకు సరైన వైద్య సాయం అందలేదన్నారు. శిబిరంలోని చాలా ఇళ్లు కాలిబూడిదయ్యాయి. శుక్రవారం మరో ముగ్గురు కుకీలు హత్యకు గురికావడంతో వారిలో ఆందోళన, భయం మరింత పెరిగింది. ఒకటిన్నర నెలల పసికందు చంపై స్కూల్‌ నిర్వహిస్తున్న శిబిరంలో ఉంది. తల్లి లింగనేలమ్మ ఆసుపత్రిలో ఈ పాపకు జన్మనిచ్చింది.
ఈ ప్రతినిధి బృందంలో సిపిఎం త్రిపుర రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌదరి, అస్సాం రాష్ట్ర కార్యదర్శి సుప్రకాష్‌ తాలుక్దార్‌, కేంద్ర కమిటీ సభ్యురాలు డెబ్లినా హెంబ్రామ్‌ తదితరులు ఉన్నారు. ఈ బృందం శుక్రవారం రాత్రి గవర్నర్‌ అనసూయ ఉయికేతో సమావేశమైంది.
మణిపూర్‌ లో పరిస్థితి ప్రమాదకరంగా ఉంది : సీతారాం ఏచూరి
మణిపూర్‌ లో పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, దేశ ఐక్యత కోసం దీనిని నియంత్రించాల్సిన అవసరం ఉందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ''తమ సంఘీభావం తెలిపేందుకు, మద్దతు ఇచ్చేందుకు వచ్చామన్నారు. మణిపూర్‌ సోదరి, సోదరులంతా ఇండియా కుటుంబంలో భాగమేనని, వారిని కలిసి ఓదార్చుతామన్నారు. భారతదేశం మీ వెంటే ఉందని వారికి చెబుతున్నాం. మణిపూర్‌ లో శాంతి, సాధారణ పరిస్థితి పునరుద్ధరించాలి '' అని అన్నారు. ముఖ్యమంత్రి ఎన్‌. బీరెన్‌సింగ్‌ను బర్తరఫ్‌ చేయాలనే ప్రతిపక్షాల డిమాండ్‌ను ఆయన పునరుద్ఘాటించారు. ''రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ బిజెపి ప్రభుత్వంతో డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇక్కడి పరిస్థితులకు వారే పూర్తి బాధ్యత వహించాలి. సాధారణ స్థితిని పునరుద్ధరించడంలో సహాయం కోసం మా వంతుగా అవసరమైనది చేయడానికి మేము సిద్ధం. హింస చాలా కాలంగా కొనసాగుతోంది. దీనిని తక్షణమే ఆపాలి'' అని ఏచూరి అన్నారు.