- ఆర్థిక సంఘం నిధులను దారిమళ్లించిన రాష్ట్ర ప్రభుత్వం
- రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు
ప్రజాశక్తి-గుంటూరు : పంచాయతీలకు నిధుల్లేక అభివృద్ధి నిలిచిపోయిందని, సర్పంచ్‌లు ఉత్సవ విగ్రహాలుగా మారారని, ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. పంచాయతీల సమస్యలపై జనచైతన్య వేదిక అధ్యక్షులు వి.లక్ష్మణరెడ్డి అధ్యక్షతన మంగళవారం గుంటూరులో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన పంచాయతీ వ్యవస్థకు నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేయడం తగదన్నారు. నిధులు లేక గ్రామాల్లో పారిశుధ్యం, వీధి దీపాలు, గ్రీన్ అంబాసిడర్ల జీతాలు వంటి కనీస సమస్యలు కూడా సర్పంచ్‌లు తీర్చలేకపోతున్నారన్నారు. సర్పంచ్‌లకు పిడిఎఫ్ అండగా ఉంటుందని, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై వాయిదా తీర్మానం ప్రవేశపడతామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవిబి.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ఎపిలో పంచాయతీలు దయనీయ స్థితిలో ఉన్నాయని, ఇది సర్పంచ్‌ల సమస్య కాదని, 12,918 పంచాయతీల్లోని 3.5 కోట్ల మంది ప్రజల సమస్య అని తెలిపారు. లైట్లు వేయటానికి, కనీసం బ్లీచింగ్ చల్లడానికి కూడా నిధులు లేవన్నారు. సర్పంచ్‌ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.పాపారావు మాట్లాడుతూ.. కేంద్ర ఆర్థిక సంఘం ద్వారా రూ.9,800 కోట్లు వస్తే వాటిల్లో సుమారు 70 శాతం విద్యుత్ బిల్లుల పేరుతో తమ అంగీకారం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం లాక్కుందన్నారు. లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కలగానే మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ జడ్‌పి చైర్‌పర్సన్ కూచిపూడి విజయ, జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, అఖిల భారత పంచాయతీ పరిషత్ కార్యదర్శి వీరాంజనేయులు, సర్పంచ్‌ల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి టి. కృష్ణమోహన్, పలువురు జిల్లా నాయకులు పాల్గొన్నారు.