- 250 రకాల మందులకు వచ్చింది 50 రకాలే
- ఇండెంట్ పంపినా సరఫరా చేయని కాంట్రాక్టు కంపెనీలు
- ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో ఇదీ దుస్థితి
ప్రజాశక్తి-హిందూపురం : ఉమ్మడి అనంతపురం జిల్లాలో హిందూపురంలో రెండు, అనంతనపురం, గుంతకల్లు, తాడిపత్రిలో ఈఎస్‌ఐ ఆస్పత్రులు ఉన్నాయి. ఇక్కడ రోజూ సుమారు 500 మందికి పైగా కార్మికులు వైద్య సేవల కోసం వస్తుంటారు. అయితే జిల్లాలో ఎక్కడా లేని విధంగా హిందూపురం ఈఎస్‌ఐ అసుపత్రికి ఎక్కువ మంది రోగులు వస్తుంటారు. హిందూపురం ప్రాంతంలో దాదాపు 20 వేల మంది కార్మికులకు పైగా ఉన్నారు. ఒక్కో కుటుంబంలో నలుగురు సభ్యులను కలుపుకుంటే మొత్తం సభ్యుల సంఖ్య సుమారు 80 వేల వరకు ఉంటారు. వివిధ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు ఆయా సంస్థలు తమ ఈఎస్‌ఐ వాటాను చెల్లిస్తాయి. దీంతో కార్మికుల కుటుంబ సభ్యులకు ఈఎస్‌ఐ డిస్పెన్సరీ, ప్యానెల్ క్లినిక్‌లో వైద్య సేవలు అందిస్తుంటారు. కడప కేంద్రంగానే కడప, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, అనంతపురానికి చెందిన ఈఎస్‌ఐ జాయింట్ ప్రాంతీయ కార్యాలయం ఉంది. 28 డిస్పెన్సరీలు ఆదోని, తిరుపతిలో, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నాయి. వైద్యుల లెక్క ప్రకారం ఆస్పత్రులు, డిస్పెన్సరీలకు ఒక్కో దానికి రోజుకు 100 నుంచి 150 మంది ఈఎస్‌ఐ కార్డు కలిగిన కార్మికులు చికిత్స కోసం వస్తుంటారు. డిస్పెన్సరీలకు అవసరమైన మందుల ఇండెంట్‌ను కడప జెడి కార్యాలయం నుంచే విజయవాడ కార్యాలయానికి పంపిస్తుంటారు. ఏయే మందులు అవసరమో వాటిని అక్కడి నుంచి డిస్పెన్సరీలకు సరఫరా చేస్తారు. సమస్యలను పరిష్కారించాలని డిమెండ్ చేస్తూ సిపిఎం, సిఐటియు నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.
మందుల కొరత..
ప్రభుత్వం మందులు సరఫరా చేసే కంపెనీలకు బకాయిలు చెల్లించడం లేదు. దీంతో కంపెనీలు ఈఎస్‌ఐ ఆస్పత్రులకు అవసరమైన మందులను సరఫరా చేయడం లేదు. మూడు నెలలకు ఓ సారి ఆస్పత్రులకు అవసరమైన మందుల ఇండెంట్‌ను జేడీ ద్వారా విజయవాడలోని డైరెక్టర్‌కు పంపిస్తుంటారు. 250 రకాల మందులకు డాక్టర్లు ఇండెంట్ పెడుతుంటారు. దీర్ఘకాలిక వ్యాధుల మందులతో పాటు బీపీ, షుగర్, లివర్, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించి మందులు తెప్పిస్తుంటారు. అయితే ప్రభుత్వం కంపెనీలకు పాత బకాయిలు ఇవ్వకపోవడంతో మందుల సరఫరా నిలిచిపోయింది. 250 రకాల మందులకు గాను ఇప్పుడు కేవలం 50 రకాలు మాత్రమే వస్తున్నాయి.
మందులే కాదు..సిబ్బందీ లేరు..
హిందూపురం ఈఎస్‌ఐ అసుపత్రిలో మందుల కొరతే కాదు.. సిబ్బంది కొరతా వేదిస్తోంది. హిందూపురం, కొట్నూరుకు సంబంధించి రెండు డిస్పెన్షరీలనూ ఒకే చోట నిర్వహిస్తున్నారు. ఇద్దరు వైద్యులు ఉన్నప్పటికీ నర్సింగ్, ల్యాబ్ టెక్నీషియన్, ఎంఎన్‌ఒతో పాటు క్లాస్-4కు సంబంధించి అన్ని పోస్టులూ ఖాళీగా ఉన్నాయి. దీంతో పాటు కార్యాలయంలో ఉండాల్సి సీనియర్ అసిస్టెంట్లు సైతం లేరు. రోగులతో పాటు వైద్యులు కూడా ఇబ్బంది పడుతున్నారు.
కార్మికులకు భారంగా..
ఈఎస్‌ఐ డిస్పెన్సరీలో మందుల కొరత ఉండడం కార్మికులను కలవరపాటుకు గురిచేస్తోంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మందులు ఇంజెక్షన్ల కోసం సుమారు రూ.2 నుంచి రూ.3 వేల విలువజేసే మందులను ఉపయోగిస్తుంటారు. వీరు క్రమం తప్పకుండా రోజూ మందులు వేసుకోవాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈఎస్‌ఐలో మందుల కొరత కారణంగా బయట మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సిరావడం కార్మికుల కుటుంబాలకు భారంగా మారుతోంది. ఇక్కడ సరైన వైద్యం అందక పోవడంతో ఇతర అసుపత్రుల్లో వైద్య సేవలు పొందితే దానికి సంబంధించిన బిల్లులు ఆరు నెలలు గడిచినా మంజూరుకావడం లేదు. ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ అసుపత్రుల్లో ఈఎస్‌ఐ కార్డు ఉన్న వారికి వైద్య సేవలు అందించలేమని తెగేసి చెబుతున్నట్లు కార్మికులు పేర్కొంటున్నారు. దీనికి కారణం ఈఎస్‌ఐ వైద్య సేవలకు సంబందించి సకాలంలో బిల్లులు మంజూరు కాక పోవడమే. ప్రతి నెలా కార్మికులు ఈఎస్‌ఐ కోసం డబ్బులు చెల్లించినప్పటికీ వైద్య సేవల కోసం అప్పులు చేసి మోయలేని భారాన్ని మోయాల్సి వస్తోంది.










