డ్యూటీలు లేవు.. సెలవులు వెళ్లండి : డ్రైవర్లు, కండక్టర్లను ఆదేశిస్తున్న ఆర్టిసి యాజమాన్యం
- అద్దెబస్సులతో రెగ్యులర్ ఉద్యోగులకు ముప్పు
- వచ్చే ఏడాది మరో వెయ్యి అద్దె బస్సులకు టెండర్లు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా తమ జీవితాల్లో వెలుగులు వస్తాయని ఆశించిన ఆర్టిసి ఉద్యోగులకు ఇప్పుడు అద్దెబస్సుల రూపంలో వారి ఉనికికే ముప్పు ఏర్పడింది. ఇన్నేళ్లు సెలవులు కూడా లేకుండా పని చేసిన ఆర్టిసి ఉద్యోగులకు పరిస్థితి ఇప్పుడు అంతా రివర్స్ అవుతోంది. ఇటీవల కాలంలో ఆర్టిసి సొంత బస్సులను పెంచుకునే బదులు అద్దె బస్సులను తీసుకుంటోంది. దీనివల్ల రెగ్యులర్ డ్రైవర్, కండక్టర్లకు డ్యూటీలు తగ్గిపోతున్నాయి. కొద్దిమందిని ట్రాఫిక్ డ్యూటీలకు పంపిస్తున్నారు. మరికొంతమందిని డిపోల్లో భద్రతా చర్యలకు కేటాయిస్తున్నారు. డ్యూటీలు అంతకంతకూ తగ్గిపోతుండటంతో కొద్దిమందికి బలవంతపు సెలవులు ఇచ్చేస్తోంది. వారికి జీతాల్లోనూ కోత విధిస్తోంది. ఎపిఎస్ ఆర్టిసిలో మొత్తం 11,236 బస్సులుంటే అందులో 2,350 అద్దెబస్సులే. కాలంచెల్లిన బస్సుల స్థానంలో కొత్తగా ఒక్కబస్సూ కొనుగోలు చేయని యజమాన్యం ఏటేటా అద్దెబస్సులను పెంచుకుంటూ పోతోంది. 2022లో దాదాపు వెయ్యి అద్దెబస్సులకు టెండర్లు పిలిచిన ప్రభుత్వం 2023లోనూ మరో వెయ్యి అద్దె బస్సులను తీసుకునేందుకు ప్రణాళికలను తయారు చేస్తోంది. ఆర్టిసికి గుదిబండగా మారిన ఇందన ధరలనుండి బయటపడేందుకు తీసుకుంటున్న విద్యుత్ బస్‌లన్నీ అద్దెబస్సులు కావడం ఆందోళన కలిగించే అంశం. ఇప్పటికే 100 విద్యుత్ బస్సులను అద్దెకు తీసుకున్న ఆర్టిసి ఇకపై విద్యుత్ బస్సులన్నీ అద్దె ప్రాతిపాదికనే తీసుకునేందుకు ఆలోచన చేస్తోంది. దీనివల్ల రెగ్యులర్ ఉద్యోగులకు పని తగ్గిపోతోంది. మరోవైపు గత ఐదేళ్లుగా ఆర్టిసిలో కొత్త ఉద్యోగ నియమకాలు చేపట్టలేదు. ఇప్పుడు వున్న ఉద్యోగుల సంఖ్య కూడా ఏటేటా తగ్గిపోతోంది. మొన్నటిదాకా ఆర్టిసిలో మొత్తం 50 వేలమందికి పైగా ఉద్యోగులుంటే ఇపుడు 49,860కి పడిపోయింది. ప్రస్తుతం 21 వేల మంది డ్రైవర్లు, 17 వేల మంది కండక్టర్లు వున్నారు. కృష్ణా జిల్లాలో మచిలీపట్నం డిపోలో మొత్తం 110 బస్‌లు వుంటే అందులో ఆర్టిసి సొంతబస్సులు 58కాగా, అద్దెబస్సులు 52 వున్నాయి. ఇదే తీరులో అన్ని డిపోల్లో అద్దెబస్సులను పెంచుకునేందుకు మొగ్గు చూపుతున్న తీరు పట్ల ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ప్రజారవాణాను నిర్వీర్యం చేసి ఆర్టిసిని ప్రైవేట్‌పరం చేసేలా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.










