- అన్ని పంటలూ తక్కువే
- పెరిగిన మొక్కజొన్న, పత్తి, మిరప
- ఖరీఫ్ చివరాఖరు లెక్కలివి
- అక్టోబర్‌లో సాగు పెరుగుతుందని సర్కారు ఆశాభావం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ఖరీఫ్ సీజన్ దాదాపు ముగిసినట్లే. జూన్ 1 నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు సీజన్ సమయం కాగా సాధారణ విస్తీర్ణంలో తొమ్మిది లక్షల ఎకరాలకు పైగా (3.69 లక్షల హెక్టార్లు) సాగు కాలేదు. నార్మల్‌లో పది శాతం విస్తీర్ణంలో సాగు లేక బీడు పడింది. ఈ తడవ పంటల సాగు కాస్త ఆలస్యంగా మొదలైనందున అక్టోబర్‌లోనూ కొంత మేరకు సేద్యం జరుగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. నీటి వనరులు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో అక్టోబర్ రెండోవారం వరకు వరి నాట్లు పడతాయని అంచనా వేస్తున్నారు. ఆశలు, అంచనాలు ఎలా ఉన్నా ఈ తడవ సీజన్ మొదటి నుంచీ సాగు ముమ్మరంగా సాగింది లేదు. కీలక సమయాల్లోనూ నత్తనడకనే నడిచింది. సాగు ఖర్చులు పెరగడం, సంస్థాగత అప్పులు పుట్టకపోవడం, అన్నింటికీ మించి పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, విపత్తు, తెగుళ్ల నష్టాల దరిమిలా రైతులు నిరాశా నిస్ప్రుహలకు లోనై కొన్ని పంటల సేద్యంపై అనాసక్తిగా ఉన్నారని చెబుతున్నారు. ఈ కారణాల వలన సాధారణ సాగులో తొమ్మిది లక్షల ఎకరాలకు మించి లోటు నెలకొంది.
పది శాతం లోటు
సర్కారు ఈ ఏడాది 96.42 లక్షల ఎకరాల్లో పంటల సాగును లక్ష్యంగా నిర్ణయించింది. సాధారణ సాగు విస్తీర్ణం 92.05 లక్షల ఎకరాలు. సెప్టెంబర్ నెలాఖరుతో సీజన్ ముగుస్తుండగా 82.82 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. నార్మల్‌లో 9.22 లక్షల ఎకరాల్లో (పది శాతం) సాగు తగ్గింది. ప్రభుత్వం తీసుకున్న టార్గెట్ కంటే 13.62 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. నిరుడు ఇదే సమయానికి నార్మల్‌లో 10 లక్షల ఎకరాల్లో సేద్యం తగ్గింది.
వర్షాలు బానే ఉన్నాయి
ఖరీఫ్ వేళకొచ్చే నైరుతి రుతుపవనాలు జూన్ 13న ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించి 20 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకూ విస్తరించాయి. అక్కడక్కడ డ్రై-స్పెల్స్ ఉన్నప్పటికీ సీజన్ మొత్తమ్మీద నార్మల్ వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్ 28 నాటికి నార్మల్ 556 మిల్లీమీటర్లు కాగా 563.2 మిమీ వర్షం పడింది. కాకినాడ, బాపట్ల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షం పడగా వైఎస్‌ఆర్ జిల్లాలో తక్కువ వర్షం పడింది. రాష్ట్రంలోని తతిమ్మా జిల్లాల్లో నార్మల్ వర్షం రికార్డయింది. రిజర్వాయర్లన్నింటిలో నీటి నిల్వలు ఆశాజనకంగానే ఉన్నాయి. భూగర్భ జలాలకు ఇబ్బంది లేదు. కాగా ఇప్పటికి 105 మండలాల్లో వర్షాభావం నెలకొంది.
అన్నీ తక్కువే
ప్రధానమైన ఆహార పంటల సాగు తగ్గింది. వరి, అపరాలు, చిరుధాన్యాలు, పప్పులు, నూనెగింజలు అన్నీ నార్మల్ కంటే తక్కువ సాగయ్యాయి. అపరాల్లో మొక్కజొన్న మాత్రం వంద శాతానికిపైన సాగైంది. వాణిజ్యపంటల్లో పత్తి నార్మల్ కంటే కొంచెం ఎక్కువ సాగైంది. మిరప సైతం స్వల్పంగా పెరిగింది. చెరకు, పొగాకు, ఇతర పప్పుధాన్యాలు తగ్గాయి. పల్నాడు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో 51-75 శాతం మధ్య సేద్యం జరగ్గా, వైఎస్‌ఆర్, అనంతపురంలో వంద శాతానికి మించి సాగు నమోదైంది. తతిమ్మా జిల్లాల్లో 76-100 వంద శాతం లోపు సేద్యం జరిగింది. ఇదిలా ఉండగా సాధారణంగా సీజన్ చివరిలో ప్రభుత్వం పంటల సాగు గణాంకాలను విడుదల చేసేది. కానీ ఈ ఏడాది అందుకు విరుద్ధంగా పొడిపొడిగా సాగు వివరాలు వెల్లడించింది.










