Oct 02,2023 20:23
  • ఐక్వెస్ట్‌ చేతికి వియాట్రిస్‌ భారత ఎపిఐ వ్యాపారం
  • వైజాగ్‌లోని మూడు ప్లాంట్లు స్వాధీనం..!

హైదరాబాద్‌ : ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ తిరిగి ఔషధ రంగంలోకి ప్రవేశిస్తున్నారు. ముఖ్య సలహాదారుడుగా ఆయన వ్యవహరిస్తున్న ఐక్వెస్ట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ తాజాగా అంతర్జాతీయ ఔషధ రంగంలో ఉన్న అమెరికా దిగ్గజం వియాట్రిస్‌కు చెందిన భారత ఎపిఐ కార్యకలాపాలను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్‌ ద్వారా నిమ్మగడ్డ ప్రసాద్‌ 17 ఏళ్ల విరామం తర్వాత తిరిగి ఫార్మా పరిశ్రమలో అడుగు పెడుతున్నట్లయ్యింది. ప్రపంచ పోటీ బిడ్‌ను అనుసరించి ప్రాధాన్య పెట్టుబడిదారుగా నిలిచినట్లు ఐక్వెస్ట్‌ సోమవారం ప్రకటించింది. ఈ డీల్‌ పూర్తియితే వైజాగ్‌లో మూడు, హైదరాబాద్‌లో మూడు భారీ స్థాయి ఎపిఐ తయారీ ప్లాంట్లతో పాటు ఇక్కడి పరిశోధన, అభివద్ధి కేంద్రం ఐక్వెస్ట్‌ చేతికి రానున్నాయి. అలాగే థర్డ్‌ పార్టీ ఎపిఐ పార్టీ విక్రయాలు కూడా సంస్థ పరం కానున్నాయి. ఈ కొనుగోలు ఒప్పందం విలువ రూ.1000 కోట్లుగా ఉందని సమాచారం.
''ఫార్మాస్యూటికల్‌ రంగంలో మా అతిపెద్ద పెట్టుబడి గురించి సంతోషిస్తున్నాం. ప్రపంచ ఔషధ పరిశ్రమలో భారత్‌ గణనీయమైన దృష్టిని ఆకర్షిస్తున్న సరైన సమయంలో మేము ఈ పెట్టుబడి చేస్తున్నాం. రెండు దశాబ్దాల ప్రయాణంలో భాగమైన మనలో కొందరు ఫార్మాలోకి సంతోషకరంగా తిరిగి రంగ ప్రవేశం చేస్తున్నారు' అని ఐక్వెస్ట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నిమ్మగడ్డ ప్రసాద్‌ కుమార్తె గునుపాటి స్వాతి రెడ్డి తెలిపారు. ఐక్వెస్ట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఫార్మాస్యూటికల్‌, హెల్త్‌కేర్‌ రంగంలో నిరూపితమైన ట్రాక్‌ రికార్డ్‌తో బహుళ రంగ పెట్టుబడి సంస్థగా ఉందన్నారు. ఎఐజి హాస్పిటల్స్‌, కేర్‌ హాస్పిటల్స్‌, సెలాన్‌ లాబొరేటరీస్‌ తదితర సంస్థల్లో ఐక్వెస్ట్‌ ద్వారా నిమ్మగడ్డ ప్రసాద్‌ గతంలో పెట్టుబడులు పెట్టి ఈ కంపెనీల అభివృద్థితో పాటు వాటాదారులకు మెరుగైన విలువైన సృష్టించిన అనుభవం ఉంది. ఖాయిలాపడ్డ మ్యాట్రిక్స్‌ ల్యాబ్స్‌ను 2000 సంవత్సరంలో నిమ్మగడ్డ ప్రసాద్‌ కొనుగోలు చేశారు. ఆరేళ్ల వ్యవధిలోనే బిలియన్‌ డాలర్‌ సంస్థగా మ్యాట్రిక్స్‌ను నిలబెట్టారు. మ్యాట్రిక్స్‌ ల్యాబ్స్‌ను 2006లో మైలాన్‌ కొనుగోలు చేసింది. 2020లో మైలాన్‌ మరొక సంస్థతో విలీనమై వియాట్రిస్‌గా పేరు మార్చుకున్న సంగతి తెలిసిందే.