- 2016 నుంచి ఇదీ పరిస్థితి
చండీగఢ్ : ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పిఎంయువై) లబ్ధిదారులు ఎల్‌పిజిని తక్కువగా వినియోగిస్తున్నారు. పిఎంయువై కాని వినియోగదారులతో పోలిస్తే తక్కువగా ఉన్నది. పిఎంయువై లబ్దిదారులు, పిఎంయువై కాని లబ్దిదారుల వార్షిక ఎల్‌పిజి వినియోగానికి మధ్య గణనీయమైన అంతరం ఉన్నది. పిఎంయువైను ప్రారంభించిన ఆరేళ్లకు పైగా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నది. ప్రభుత్వ సమాచారంలో ఈ విషయం తెలిసింది. కేంద్ర పథకం విజయం సాధించలేదనటానికి ఈ గణాంకాలే నిదర్శనమని విశ్లేషకులు చెప్పారు.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అనే మూడు చమురు కంపెనీలు (ఒఎంసిలు) నుంచి సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) కింద పొందిన సమాచారం ప్రకారం.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో మొత్తం రూ. 179 కోట్ల సిలిండర్లు 30.5 కోట్ల క్రియాశీల ఎల్‌పిజి వినియోగదారులకు విక్రయించబడ్డాయి. ఇందులో తొమ్మిది కోట్ల మంది పిఎంయువై లబ్ధిదారులు ఒక్కో వినియోగదారునికి ఏడాదికి సగటున 3.5 సిలిండర్ల చొప్పున 31 కోట్ల సిలిండర్లను రీఫిల్ చేశారు. మరోవైపు, 21.5 కోట్ల మంది నాన్-పీఎంయూవై వినియోగదారులు 148 కోట్ల సిలిండర్‌లను ఒక్కో వినియోగదారునికి ఏడాదికి సగటున ఏడు సిలిండర్‌లను రీఫిల్ చేశారు.
పిఎంయువై వెబ్‌సైట్ భారత్‌లోని 99 శాతం గృహాలు ఇప్పుడు ఎల్‌పిజి కనెక్షన్లను కలిగి ఉన్నాయని వివరిస్తున్నది. అది వాస్తవానికి భిన్నంగా ఉన్నది. వాస్తవానికి మోడీ సర్కారు ఈ పథకాన్ని 2016లో ప్రారంభించింది. కట్టెలు, బొగ్గు వంటి సాంప్రదాయ వంట ఇంధనాల స్థానంలో గ్రామీణ, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు స్వచ్ఛమైన వంట ఇంధనాన్ని అందుబాటులో ఉంచటానికి పిఎంయువై పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం మాత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదనీ, ఇందుకు పిఎంయువై, ప్రభుత్వ గణాంకాలే నిదర్శనమని విశ్లేషకులు చెప్పారు.










