
హైదరాబాద్ : పెరిగిపోయిన గ్యాస్ సిలిండర్ ధరలతో విలవిలలాడుతున్న సామాన్య ప్రజలకు సీఎం కేసీఆర్ ఊరటనిచ్చే విషయాన్ని ప్రకటించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన లబ్దిదారులకు రూ. 400కే గ్యాస్ సిలిండర్‌ను అందిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ మేనిఫెస్టో ప్రకటన సందర్భంగా తెలంగాణ భవన్‌లో కేసీఆర్ మాట్లాడారు.కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు.. ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు ధరలు తగ్గినా కూడా గ్యాస్ సిలిండర్ ధరలను పెంచాయి. గత ప్రభుత్వాలు ప్రజల మాటల పెడచెవిని పెడుతూ అడ్డగోలుగా గ్యాస్ ధరలు పెంచారు. చాలా మంది తెలంగాణలో పొయ్యిల కట్టెలు తెచ్చుకుని గొట్టాలు పట్టి ఊదే పరిస్థితి వచ్చింది. ఈ బాధ కూడా పోవాల్సి ఉంది. అర్హులైన లబ్ధిదారులకు రూ. 400కే గ్యాస్ సిలిండర్ అందిస్తాం. అక్రిడేషన్ జర్నలిస్టులకు ఆదాయంతో సంబంధం లేకుండా.. ఎందుకంటే వారు ప్రజాసేవలో ఉంటారు కాబట్టి.. రూ. 400కే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందని కేసీఆర్ తెలిపారు.