న్యూఢిల్లీ : వాణిజ్య అవసరాల కోసం ఎల్‌పిజి గ్యాస్‌ను వినియోగించే వారికి చేదు వార్త. చమురు కంపెనీలు వాణిజ్య ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ల ధరల్ని పెంచేశాయి. వాణిజ్య సిలిండర్ ధర తాజాగా రూ.101.50 పెరిగింది. గత రెండు నెలల్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర పెరగడం ఇది రెండోసారి. కొత్త ధరలు బుధవారం నుంచే అమలులోకి వచ్చాయి. రాజధాని న్యూఢిల్లీలో 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.1731 నుండి రూ.1,833కు పెరిగింది. దేశంలోని నాలుగు మెట్రో నగరాలకు సంబంధించి చెన్నరులో దీని ధర అత్యధికంగా రూ.1,999.50 ఉండగా ముంబయిలో అతి తక్కువగా రూ.1,785.50కు విక్రయిస్తున్నారు. కొల్‌కతాలో ఈ సిలిండర్ ధర రూ.1,943గా, బెంగళూరులో రూ. 1914.50గా ఉంది. గత నెలలో చమురు కంపెనీలు వాణిజ్య సిలిండర్ ధరను రూ.209 పెంచాయి. సెప్టెంబర్‌లో రూ.158 తగ్గించాయి. ఇజ్రాయిల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయని, వాటికి అనుగుణంగానే వాణిజ్య సిలిండర్ల ధరల్ని పెంచాల్సి వస్తోందని చమురు కంపెనీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ చెబుతున్నాయి.