Dec 26,2022 11:28
  • ట్రేసర్‌, ట్రాకింగ్‌తో టోల్‌ వసూళ్లు :

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జాతీయ రహదారులపై టోలు వసూలులో పెనుమార్పులు రానున్నాయి. వాహనదారులపై కొత్త తరహా బాదుడుకు కేంద్రంలోని మోడీ సర్కార్‌ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతమున్న టోల్‌ప్లాజాలన్నీ కనుమరుగయ్యేవీలుంది. వీటి స్థానంలో జిపిఎస్‌ సాంకేతిక పరిజ్ఞానం తీసుకొచ్చి వాహనదారులపై భారాలు వేయనున్నారు. దీనివల్ల టోల్‌గేట్ల సంఖ్య కూడా తగ్గిపోవడం లేదా పూర్తిగా కనుమరగవ్వడం వల్ల ఆ మేరకు వాటిలో ఉపాధి పొందుతున్న కార్మికులు రోడ్డునపడే పరిస్థితి తలేత్తెనుంది. కొత్త విధానంలో..ప్రస్తుతమున్న టోల్‌ప్లాజాలను తొలగించి రోడ్లపై ఏర్పాటు చేసే కెమెరాలతో జిపిఎస్‌ సాంకేతిక పరిజ్ఞానంతో టోలు వసూలు చేస్తారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. జాతీయ రహదారి పైకి వచ్చే వాహనాల నుండి ఒక్క కిలోమీటర్‌కు కూడా మినహాయింపు లేకుండా ప్రతి కిలోమీటర్‌కు టోల్‌ఫీజ్‌ను వసూలు చేయనున్నారు. ఇప్పటిదాకా టోల్‌ప్లాజాల వద్దే టోల్‌ఫీజ్‌ వసూలు చేస్తుండగా..ఇకపై జాతీయ రహదారి పైకి వస్తే చాలు వాహనదారుల నుంచి టోల్‌ఫీజ్‌ వసూలు చేసేలా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తోంది. ప్రతివాహనం ఫాస్టాగ్‌ను పెట్టుకొని టోల్‌గేట్ల వద్ద ఆటోమేటిక్‌గా టోల్‌ఫీజ్‌లను ఎలా చెల్లిస్తారో ఇకపై రోడ్డుమీదికి వచ్చిన ప్రతి వాహనం ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసిందో ఆ మేర ఫీజ్‌ను ఆ వాహనం రోడ్డు దిగగానే ఫీజు కింద వసూలు చేసే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఇప్పటి దాకా టోల్‌గేట్‌ సమీప గ్రామాలకు చెందిన ప్రజల వాహనాలకు మినహాయింపులు వుండేవి. జిపిఎస్‌ పద్ధతిలో అలాంటి వెసులుబాటుకు మోడీ సర్కార్‌ మంగళం పాడనుంది. ప్రతి వాహనానికి ఇకపై ఫాస్టాగ్‌ స్థానంలో జిపిఎస్‌ ట్రాకర్‌ను తప్పనిసరి చేస్తారు. జిపిఎస్‌ ట్రాకర్‌ వున్న వాహనం రోడ్డు ఎక్కగానే కౌంట్‌ మొదలవుతుంది. ఆ రోడ్‌ దిగగానే ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసిందో లెక్కకట్టి కిలోమీటర్‌కు ఫిక్స్‌ చేసిన ఫీజు ప్రకారం టోల్‌ఫీజును వాహనదారుల ఖాతా నుండి కట్‌ అవుతుంది. ఈ విధానంను 2023 జూన్‌ నుండి అమలులోకి తీసుకురానున్నారు. 2024లోపు రాష్ట్రంలో వుండే టోల్‌ప్లాజాలు అన్నీ కనుమరుగు కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వున్న 8615 కిలోమీటర్ల జాతీయ రహదారుల రోడ్లకు టోల్‌ ఫీజ్‌లు వసూలు చేస్తున్నారు. అలాగే రాష్ట్రంలోని వినుకొండ, తిరుపతి సమీపంలో రాష్ట్ర రహదారులకు కూడా టోల్‌ ఫీజ్‌ వసూలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 57 టోల్‌ప్లాజాలు వుంటే అందులో చెన్నరు-కోల్‌కొత రోడ్డుపైనే 19 టోల్‌ గేట్లు వున్నాయి. ఈ టోల్‌గేట్లన్నింటి స్థానంలో జిపిఎస్‌ పద్ధతిలో టోల్‌ఫీజు వసూళ్లకు ఏర్పాట్లు చేయనున్నారు. ప్రస్తుతం టోల్‌గేట్లలో ఉపాధి పొందుతున్నవారు కూడా రోడ్డున పడే వీలుంది.