Sep 24,2022 10:39
  • ఫీజులు, అపరాధ రుసుములు మాఫీ చేసేందుకు ప్రతిపాదన

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఇండియన్‌ టెలికమ్యూనికేషన్‌ బిల్లు-2022 ముసాయిదాపై అక్టోబర్‌ 20 అభిప్రాయాలు, సూచనలు, సలహాలు పంపాలని కేంద్ర టెలి కమ్యూనికేషన్‌ మంత్రి అశ్విని వైష్ణవ్‌ కోరారు. శుక్రవారం నాడిక్కడ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త టెలికాం బిల్లు 6-10 నెలల్లో అమల్లోకి వస్తుందని, సంప్రదింపుల ప్రక్రియ పూర్తయ్యాక తుది ముసాయిదాను రూపొందిస్తామని తెలిపారు. దాన్ని తొలుత పార్లమెంట్‌ కమిటీకి పంపుతామని, ఆ తర్వాతే పార్లమెంట్‌లో ప్రవేశపెడతామని చెప్పారు. ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ చట్టం - 1885, ఇండియన్‌ వైర్లెస్‌ టెలిగ్రఫీ చట్టం- 1933, టెలిగ్రాఫ్‌ వైర్స్‌ (చట్టవిరుద్ధ స్వాధీనం) చట్టం- 1950 స్థానంలో కేంద్రం కొత్త బిల్లును తీసుకొస్తోంది. ముసాయిదా బిల్లుపై అక్టోబరు 20లోపు స్పందనలు తెలియజేయాలని కోరింది. టెలికాం, ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల ఫీజులు, అపరాధ రుసుముల్ని మాఫీ చేసే నిబంధనను సైతం బిల్లులో ప్రభుత్వం ప్రతిపాదించింది. ఒకవేళ సదరు సంస్థలు లైసెన్సులను సరెండర్‌ చేసిన సందర్భంలో రుసుములు వెనక్కి తిరిగి ఇచ్చే ప్రతిపాదనను కేంద్రం ఇందులో చేర్చింది.