Jun 30,2023 08:22

'నాలుగు నెలల క్రితం కొన్న షూ అప్పుడే పై భాగం ఊడిపోయింది...', 'సంవత్సరం వాడినా చెప్పు అడుగుభాగం అరగలేదు, కాని పై పట్టీలు ఊడిపోయాయి...' ఇటువంటి అనుభవాలు చాలామందికి ఎదురవుతూనే ఉంటాయి. అప్పుడు వాటిని పారేయలేము. అలా అని వాడకోవడానికీ ఉపయోగపడవు. కానీ, గ్రీన్‌సోల్‌ సంస్థకు ఇస్తే వారు వాటిని రీ మోడలింగ్‌ చేసి, కొత్త పాదరక్షలగా మార్చి పేదవాళ్లకు, స్కూలు విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. క్రీడాకారులైన శ్రీయాన్స్‌, రమేష్‌ తొమ్మిదేళ్ల నుంచి ఈ మంచి పని చేస్తున్నారు.

New-show-for-old-shoes


           ముంబైలో బ్యాచులర్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చదువుకోవడానికి వచ్చిన శ్రియాన్స్‌కి, రమేష్‌కి ఓ క్రీడా ప్రాంగణంలో పరిచయం ఏర్పడింది. ఓ కోచ్‌ దగ్గర ఇద్దరూ శిక్షణ పొందారు. వారి అభిప్రాయాలు, ఆలోచనలు ఒకటే కావడంతో స్నేహం బలపడింది. షూస్‌, బట్టలు పంచుకుంటూ పోటీల్లో పాల్గొనేవారు. అప్పటికే శ్రియాన్స్‌ విదేశాల్లో జరిగే పోటీల్లో పాల్గొని 100కి పైగా బహుమతులు గెలుచుకున్నాడు. దాంతో తరుచూ షూష్‌ కొనాల్సివచ్చేది. అవి నాలుగు, ఐదు నెలల కంటే ఎక్కువ రోజులు వచ్చేవి కావు. వాటిని పారేసి, కొత్తవి కొనుక్కునేవాడు. రమేష్‌ మాత్రం పాత షూస్‌ని చెప్పులుగా మార్చుకుని వాడుకునేవాడు. అవి మోడల్‌గా కనిపించడంతో శ్రియాన్స్‌కు కొత్త ఆలోచన వచ్చింది. క్రీడాకారులైనందున ప్రతి సంవత్సరం మూడు, నాలుగు ఖరీదైన షూస్‌లను కొనాల్సి వచ్చేది. వాటిని తిరిగి ఎలా వాడుకోవాలో అర్థం అయ్యేది కాదు. పై భాగం తొలగించి, సాధారణ చెప్పల్‌గా మార్చి వాడుకుంటున్న రమేష్‌ ఉపాయాన్ని చూసి శ్రియాన్స్‌లో ఆసక్తి కలిగింది. ఆ విధంగా 'గ్రీన్‌ సోల్‌' సంస్థకు పునాది ఏర్పడింది. ప్రతి సంవత్సరం 35 కోట్ల జతల నాన్‌ బయోడిగ్రేడబుల్‌ బూట్లు వృథా అవుతున్నాయని తెలుసుకున్నారు. అదే క్రమంలో ఒకటిన్నర కోటి మంది పాదరక్షలు లేకుండానే తిరుగుతు న్నారని, ఆ కారణంగా పాదాల ద్వారా సంక్రమించే వివిధ వ్యాధులతో బాధపడుతున్నారని గ్రహించారు. కార్బన్‌ ఉద్గారాల నుంచి పర్యావరణాన్ని రక్షించేలా వ్యాపారం ప్రారంభించి, పేదలకు పాదరక్షలు అందించాలను కున్నారు.
 

                                                                      ఇంటిని అద్దెకు తీసుకుని ...

2014లో ముంబైలో జరిగిన పోటీల్లో పాల్గొని, గెలుచుకున్న ఐదు లక్షల నగదుని షూ తయారీపై పరిశోధనలు మొదలు పెట్టారు. కొన్ని షూ కంపెనీల దగ్గర శిక్షణ కూడా తీసుకున్నారు. అప్పటికే రమేష్‌ ఓ సీనియర్‌ క్రీడాకారుడు దగ్గర అసిస్టెంట్‌గా నెలకు రూ.4,500 జీతానికి పని చేస్తున్నాడు. దాంతో థక్కర్‌ భప్పా కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. పాదరక్షల తయారీదారుల్లో అనుభవం ఉన్న ఐదుగురు కార్మికులతో కలిసి పని ప్రారంభించాడు. పాత బూట్లను పెద్ద మొత్తంలో సేకరించి, రంగురంగుల స్లిప్పర్స్‌గా పునర్నిర్మిస్తున్నారు. వీటిలో అద్భుతంగా ఉన్నవాటిని ఆన్‌లైన్‌ ద్వారా అమ్ముతున్నారు. ఆ నగదుతోనే వర్కర్లకు జీతాలు ఇస్తున్నారు. ఎక్కువ మొత్తంలో తయారుచేసిన చెప్పల్స్‌ను విద్యార్థులకు, వృద్ధులకు విరాళంగా ఇస్తున్నారు. 'గ్రీన్‌ సోల్‌' కంపెనీ ద్వారా రమేష్‌, శ్రీయాన్‌ మహారాష్ట్ర, గుజరాత్‌లో పల్లె గ్రామాలకు, స్కూళ్లుకు వెళుతున్నారు. ప్రతి ఏటా పేదలకు, విద్యార్థులకు 25 వేల జతల పాదరక్షలు విరాళంగా అందిస్తున్నారు.
 

                                                                         దాతల సహాయంతో ...

రమేష్‌, శ్రియాన్‌ల సేవలను గుర్తించిన తోటి క్రీడాకారులు, స్థానికులకు తమ దగ్గర ఉన్న పాత షూస్‌లను, పాత పాదరక్షలను అందిస్తున్నారు. సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకున్న కొత్తమంది కొరియర్‌ ద్వారా పంపిస్తున్నారు. కొన్ని ప్రయివేటు షూ కంపెనీలు ముందుకు వచ్చి వీరిని ప్రోత్సహిస్తున్నాయి. ఈ కంపెనీ స్థాపన వెనక ఉన్న ఉద్దేశాన్ని తెలుసుకున్న వినియోగదార్లూ ఆన్‌లైన్లలో వీరి షూస్‌ని ఉత్సాహంగా కొనుగోలు చేసి ఆర్థికంగా సహాయం అందిస్తున్నారు. ఇలా దేశంలో ఉన్న పేద క్రీడాకారులకు, బడుగు బలహీన వర్గాల వారికి పాదరక్షలను అందించడమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్న శ్రీయాన్‌, రమేష్‌లను పలువురు అభినందిస్తున్నారు.