- 28బంగారు, 38రజత, 41కాంస్యాలతో 107 పతకాలు
- చివరిరోజు 6స్వర్ణాలు
- నేటితో ముగియనున్న 19వ ఆసియా క్రీడలు
హాంగ్జౌ: 19వ ఆసియా క్రీడల్లో భారత్ నయా చరిత్ర నెలకొల్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రికార్డు స్థాయిలో 107 (28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలు) అత్యధిక పతకాలను సాధించింది. 'సెంచరీ' పతకాలే లక్ష్యంగా ఈ క్రీడల బరిలోకి దిగిన భారత్ ఆ ఫీట్‌ను అందుకోవడం హర్షించదగ్గ విషయం. ఇక ఇండోనేషియా వేదికగా 2018లో జరిగిన జకార్తా ఆసియా క్రీడల్లో భారత్ 70(16స్వర్ణ, 23రజత, 31కాంస్య) పతకాలతో 8వ స్థానంలో నిలువగా.. ఈసారి 107పతకాలతో నాల్గో స్థానానికి ఎగబాకింది. ఇక చైనా 382 పతకాలతో (200స్వర్ణాలు, 111రజతాలు, 71కాంస్యాలు) అగ్రస్థానంలో నిలువగా.. జపాన్ 186 పతకాలు (51 స్వర్ణాలు, 66 రజతాలు, 69 కాంస్యాలు), ద. కొరియా 190 పతకాలు (42 స్వర్ణాలు, 59 రజతాలు, 89 కాంస్యాలు) టాప్-3లో నిలిచాయి.

ఆఖరిరోజు ఆరు స్వర్ణాలు...
చివరి రోజు భారత్‌కు ఏకంగా 6 స్వర్ణ పతకాలు దక్కాయి. కబడ్డీలో మహిళల, పురుషుల జట్లు, పురుషుల క్రికెట్, బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌లో చిరాగ్-సాత్విక్, కాంపౌండ్ ఆర్చరీలో ప్రవీణ్ ఓజాస్, వ్యక్తిగత విభాగంలో వెన్నం జ్యోతి సురేఖ స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నారు. అలాగే ఆర్చరీలో అభిషేక్ వర్మ రజత, అదితి కాంస్య పతకాలను చేజిక్కించుకున్నారు. మహిళల హాకీ జట్టు 2-1 గోల్స్ తేడాతో జపాన్‌ను ఓడించి కాంస్య పతకాన్ని ముద్దాడగా.. రెజ్లింగ్‌లో దీపక్ పునియా ఫైనల్లో ఓడి రజత పతకానికే పరిమితమయ్యాడు. శనివారం మహిళల కబడ్డీ జట్టు ఫైనల్లో చైనీస్ తైపీని ఓడించి స్వర్ణ పతకాన్ని సాధించడం ద్వారా ఈ ఆసియా క్రీడల్లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 100 మార్క్‌కు చేరింది.

- ప్రముఖుల శుభాకాంక్షలు..
ఈసారి ఆసియా క్రీడల్లో వందకు పైగా పతకాలు సాధించిన భారత అథ్లెట్లకు భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు ప్రముఖులు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అద్భుత ప్రదర్శన కనబర్చిన అథ్లెట్లకు ఆతిథ్యమివ్వాలని, వారితో సంభాషించేందుకు ఆతృతతో ఎదురుచూస్తున్నానని ప్రధాని ట్వీట్ చేయగా.. సెంచరీ పతకాలే లక్ష్యంగా వెళ్లిన అథ్లెట్లు ఆ ఫీట్ చేరుకోవడం హర్షిందగ్గ విషయమని క్రీడల శాఖమంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. ఈసారి ఆసియా క్రీడల్లో నయా చరిత్ర సృష్టించారని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ట్వీట్‌లో పేర్కొనగా.. సెంచరీ మార్క్‌ను అందుకోవడంలో మహిళా అథ్లెట్లు కీలకపాత్ర పోషించారని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ట్వీట్‌లో అథ్లెట్లకు శుభాకాంక్షలు తెలిపారు.












